వీసీపై ఏఎంఎస్, డీహెచ్‌పీఎస్ ఆగ్రహం
సీతంపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును ఆహ్వానించి, వేదిక మీదకు పిలవకుండా అవమానపరచడం దారుణమని అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ(ఏఎంఎస్) అధ్యక్షుడు బొడ్డు కల్యాణరావు ధ్వజమెత్తారు. రామటాకీస్ రోడ్డులోని అంబేడ్కర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్ల బాబూరావు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే కావాలని వివక్ష చూపి అవమానించారని ఆయన మండిపడ్డారు. ఆయన ఏయూ పూర్వ విద్యార్థి అని, ఆహ్వాన పత్రికలో పేరు ముద్రించినప్పటికీ వేదికపైకి ఆహ్వానించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ బాధ్యత వహించాలని, ఆయనను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
రాజకీయం చేయడం సబబు కాదు:
డీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ మాట్లాడుతూ.. ఘన చరిత్ర కలిగిన ఏయూ వందేళ్ల పండగ ఏ ఒక్కరికో సొంతం కాదని, ఇది కేవలం టీడీపీ కార్యక్రమంగా జరపడం సరికాదని విమర్శించారు. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ, హీరేన్ ముఖర్జీ వంటి మహనీయులతో అనుబంధం ఉన్న ఈ విద్యాలయం ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ దిగ్గజాలను అందించిందన్నారు. సచిన్ టెండూల్కర్, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు వేదికను పంచుకున్నప్పుడు, అదే కోవకు చెందిన గొల్ల బాబూరావును ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన వేడుకలను రాజకీయం చేయడం పద్ధతి కాదని పేర్కొన్నారు. ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించాల్సిన అవసరం ఉందని, వర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ హోదా కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏఎంఎస్ కోశాధికారి గార సత్యనారాయణ, సహాయ కార్యదర్శి బత్తుల గౌతమ్ బాబు, బోని అప్పారావు, బొడ్డు రాజు తదితరులు పాల్గొన్నారు.


