శతాబ్ది వేడుకల్లో
దళితుడిననే పిలిచి అవమానించారా చంద్రబాబూ?
విశాఖ సిటీ : ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ముగిశాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సోమవారం జరిగిన తుది వేడుకల్లోను స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా వినిపించాయి. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రసంగాలు మినహా, మిగిలిన వారి మాటలన్నీ రాజకీయ వేదికను తలపించాయి. విద్యాలయాల పవిత్రతను కాపాడాల్సిన సభలో అకడమిక్ అంశాల కంటే రాజకీయ ప్రశంసల హోరు పెరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విశాఖను పాలనా రాజధానిగా వ్యతిరేకిస్తూ నగరంపై విమర్శలు చేసిన వారే, నేడు ఏయూ ఘనతను ఆకాశానికెత్తడం పలువురిని విస్మయానికి గురిచేసింది.
ఆకట్టుకున్న సాంస్కృతిక, ఫొటో ప్రదర్శనలు
మధ్యాహ్నం 2 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శాసీ్త్రయ నృత్యాలు, అన్నమాచార్య కీర్తనాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు వేడుకలకు వన్నె తెచ్చాయి. అలాగే విశ్వవిద్యాలయ చరిత్ర, చారిత్రక సంఘటనలను తెలిపే విధంగా ప్రధాన వేదికకు వెనుక భాగంలో ఉన్న ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా నిలిచింది. ఎగ్జిబిషన్ ప్రత్యేకతలను ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి ఇతర ప్రముఖులను వివరించారు. ఏయూ చిత్రకళా విభాగం విద్యార్థులు తయారు చేసిన అనేక శిల్పాలను ప్రదర్శనలో ఉంచారు.
మూడు అవగాహన ఒప్పందాలు
ఈ వేడుకల్లో మూడు అవగాహన ఒప్పందాలను చేసుకున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో ఎంవోయూ జరిగింది. ఓ.ఎక్స్.ఎం.ఐ.క్యూ తో ఏయూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఏఐ సిస్టమ్ నెలకొల్పే విధంగా మరో ఒప్పందం జరిగింది. దీనిలో దాదాపు 400 కోట్లతో అభివృద్ధి చేస్తారు. అదే విధంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ(ఐఐటీఎం)తో అవగాహన కుదుర్చుకున్నారు. రూ.180 కోట్లతో మెటీరియాలజీకి సంబంధించిన పరికరాలు, మౌలిక వసతుల కల్పన చేస్తారు.
విశిష్ట పూర్వవిద్యార్థులకు సన్మానం
శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థులు పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ కె.హరిబాబు, జీఎంఆర్ గ్రూప్ అధినేత జి.ఎం.రావు, సైయిట్ చైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్.మోహన రెడ్డి, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ చావ సత్యనారాయణ, ఐఐటీ కాన్పూర్ పూర్వ ఆచార్యుడు ఎం.ఆర్ మాధవ్, సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను సత్కరించి, జ్ఞాపికలు ప్రధానం చేశారు.
భారీగా విద్యార్థుల సమీకరణ
ముగింపు వేడుకలకు భారీగా విద్యార్థులను సమీ కరించారు. ఏయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, నాన్‌టీచింగ్ స్టాఫ్‌తో పాటు ఏయూ గుర్తింపు కాలేజీల విద్యార్థులను తరలించారు. నగరం నుంచి మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లా నుంచి కూడా విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తీసుకురావడం గమనార్హం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులను తీసుకురావాలని పలు ఏయూ గుర్తింపు కాలేజీల నిర్వాహకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ.. సభా
ప్రాంగణం
నిండలేదు.
విద్యార్థులు వెళ్లిపోకుండా నిర్బంధం
వేడుకల్లో సచిన్ ప్రసంగం తర్వాత విద్యార్థులు ప్రాంగణం నుంచి వెళ్లిపోడానికి సిద్ధమయ్యారు. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ప్రాంగణం వారు వెళ్లిపోతే ఖాళీ అయిపోతుందని అధికారులు గుర్తించారు. వెంటనే విద్యార్థులు వెళ్లిపోకుండా కట్టడి చేశారు. అందరి ప్రసంగాలు ముగిసేంత వరకు విద్యార్థులు బయటకు రాకుండా దారులను మూసివేశారు. అప్పటికీ కొందరు వాటిని దాటుకొని వెళ్లడానికి ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది, వలంటీర్లతో అడ్డగించడం గమనార్హం.
భవిష్యత్తుపై దృష్టి..
ఏయూ శతాబ్దపు ప్రయాణం కేవలం గడిచిన కాలానికి పరిమితం కాకుండా, భవిష్యత్తు దిశగా దూసుకెళ్లే సంకల్పానికి ప్రతీకగా కనిపిస్తోంది. పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ఆధునిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం ద్వారా ఏయూను ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యం. ముఖ్యంగా ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో ముందడుగు వేయాలన్న ఆలోచన బలంగా ఉంది.
–జీపీ రాజశేఖర్, ఏయూ వీసీ
ఏయూ..ఆత్మగౌరవానికి ప్రతీక
ఏయూ ప్రయాణం కేవలం శతాబ్ద కాల చరిత్ర కాదు, అది విద్య, సంస్కృతి, ఆత్మగౌరవం కలిసిన ఓ గొప్ప గాథ. దేశవ్యాప్త ర్యాంకింగ్స్‌లో మూడో స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా, ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టమవుతోంది. ఈ లక్ష్య సాధనకు కేవలం మాటలు కాకుండా, మౌలిక సదుపాయాలు, పరిశోధన అవకాశాలు, అధ్యాపక బలం వంటి అంశాల్లో దృఢమైన చర్యలు అవసరం.
–నారా లోకేష్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
శతాబ్ది ఉత్సవాల్లో అవమానంపై
ఎంపీ గొల్ల బాబూరావు ఆగ్రహం
విశాఖసిటీ: దళితుల పట్ల చంద్రబాబు మరోసారి నీచమైన బుద్ధిని ప్రదర్శించారని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు. శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందడంతో వేడుకలకు హాజరైతే తనని వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఒక రాజ్యసభ సభ్యునికి ఇచ్చే మర్యాద ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మొదటి నుంచి దళితులంటే చిన్నచూపనీ.. ఇది కేవలం గొల్ల బాబూరావుకి జరిగిన అవమానం కాదనీ.. యావత్ దళిత జాతికి జరిగిన అవమానమని దుయ్యబట్టారు. ఏ అర్హత ఉందని డైరెక్టర్ త్రివిక్రమ్‌ని వేదిక పైకి ఆహ్వానించారని ప్రశ్నించారు. నాకు జరిగిన అవమానం పై రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
సచిన్ ప్రత్యేక ఆకర్షణ
మద్దిలపాలెం: శతాబ్ది ఉత్సవాల్లో సచిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ముగింపు సభకు రావడం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సచిన్ సభా వేదిక వద్దకు రాగానే విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. సచిన్ స్కెచ్‌లు వేసిన పోస్టర్లను ప్రదర్శించారు. సచిన్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా సచిన్ సచిన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన చేసిన ఉత్తేజపూరిత ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు. అలాగే ఏయూలో ఫిజిక్స్ చదువుకోవడానికి వచ్చి తెలుగు సాహిత్యం వైపు ఎలా మళ్లారో సినీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో వివరిస్తూ విద్యార్థులను అలరించారు.


