బంకుల వద్ద ’నో స్టాక్’.. వాహనదారుల షాక్ మహానగరంలో మంట పుట్టిస్తున్న చమురు కొరత
విశాఖ సిటీ: మహా నగరం విశాఖకూ చమురు సెగ తగిలింది. సోమవారం ఉదయం నుంచి ఇంధనం దొరకడం గగనమైంది. పెట్రోల్, డీజిల్ దొరకక వాహనాలపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం వాహనదారుల్లో కలవరం రేపింది. స్టాకు ఉన్న బంకులకు అందరూ పోటెత్తడంతో రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వేచి చూసినా పెట్రోల్ దొరకడం కష్టమైపోయింది. పెట్రోల్ బంకుల్లోనే అధిక సమయం వేచి ఉండడంతో నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక, ఆఫీసులకు వెళ్లలేక జనం నడిరోడ్డుపై నానా యాతన పడాల్సిన వచ్చింది. ఒకవైపు జిల్లా యంత్రాంగం, చమురు కంపెనీలు నిల్వలు ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘చుక్క’ దొరకడం గగనమైపోయింది. ఈ డిమాండ్ నేపథ్యంలో కొన్ని బంకులు కోటా విధానాన్ని అమలు చేయడం గమనార్హం.
స్తంభించిన నగరం.. బంకుల వద్ద బారులు
జిల్లాలో సుమారు 120 బంకులు ఉన్నాయి. జిల్లా అవసరాలకు రోజుకు 1.5 లక్షల లీటర్ల పెట్రోల్, లక్ష లీటర్ల డీజిల్ సరఫరా కావాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం సరఫరా గణనీయంగా తగ్గినట్లు బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చమురు కష్టాలు మొదలయ్యాయన్న వార్తలతో సోమవారం విశాఖ వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు క్యూ కట్టారు. ఉదయం 9 గంటలకే చాలా బంకుల్లో నిల్వలు ఖాళీ అయిపోవడంతో ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. సిరిపురం జంక్షన్, జగదాంబ, సీతమ్మధార వంటి కీలక ప్రాంతాల్లో వందల మీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎండ తీవ్రతకు తోడు పెట్రోల్ దొరకకపోవడంతో ఆగ్రహించిన వాహనదారులు బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
కొన్ని చోట్ల కోటా విధింపు
ఇంధనం త్వరగా అయిపోతుందన్న భయంతో చాలామంది అవసరానికి మించి కొనుగోలు (ప్యానిక్ బయింగ్) చేయడంతో నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. దీన్ని అరికట్టేందుకు బంకుల నిర్వాహకులు కోటా విధానాన్ని ప్రకటించారు. బైక్‌లకు 2 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, భారీ వాహనాలకు 100 లీటర్లు మాత్రమే పోస్తామంటూ పోస్టర్లు అతికించారు. ఈ నిబంధన వల్ల ఆఫీసులకు వెళ్లేవారు, ఆన్‌లైన్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోంది.
డీజిల్ కొరతతో రవాణా అస్తవ్యస్తం
డీజిల్ దొరకక లారీలు, బస్సులు బంకుల వద్దే నిలిచిపోవడంతో సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఆక్వా రంగం, వ్యవసాయ పనులకు డీజిల్ అత్యవసరం కావడంతో రైతులు, డ్రైవర్లు ప్లాస్టిక్ డబ్బాలతో పడిగాపులు కాస్తున్నారు. డీజిల్ లేక జనరేటర్లు నడవని పక్షంలో ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీల్లోని నిల్వలు పాడైపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంకెల్లో ‘మాయాజాలం’.. క్షేత్రస్థాయిలో శూన్యం : అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 1,860 కేఎల్ పెట్రోల్, 2,118 కేఎల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలు 823 కిలోలీటర్ల పెట్రోల్, 1,121 కిలో లీటర్ల డీజిల్ బంకులకు సరఫరా చేసినట్లు చెబుతున్నాయి. కానీ, ఆ నిల్వలు ఎక్కడికి వెళ్తున్నాయో సామాన్యులకు అర్థం కావడం లేదు. సోమవారం 424 కేఎల్ పెట్రోల్, 401 కేఎల్ డీజిల్ అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చూపిస్తుండడం గమనార్హం. ఇంకా 1436 కేఎల్ పెట్రోల్, 1717 కేఎల్ డీజిల్ నిల్వలు ఉన్నట్లు చూపిస్తున్నారు. అధికారులు చెబుతున్న అంకెలు కాగితాలకే పరిమితమయ్యాయని వాహనదారులు మండిపడుతున్నారు. లోడింగ్ పాయింట్ల వద్ద జాప్యం వల్ల ట్యాంకర్లు సకాలంలో చేరడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. మంగళవారం నాటికి నిల్వ లు పూర్తిగా అయిపోతాయనే ప్రచారం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజల్లో నెలకొన్న భయం వల్ల డిమాండ్ 40 శాతం అదనంగా పెరగడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇంధన సరఫరాను పునరుద్ధరించకపోతే నగరం పూర్తిస్థాయిలో స్తంభించిపోయే ప్రమాదం ఉంది.


