కూటమి ప్రభుత్వం తీరుపై సీపీఎం విమర్శలు
మద్దిలపాలెం: రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గూగుల్‌కు దాసోహమైందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు విమర్శించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, వి.కృష్ణారావులతో కలిసి పిఠాపురం కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయం ఏచూరి భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం, అడవులు, వన్యప్రాణులను పణంగా పెట్టి 601.40 ఎకరాల భూమి, రూ.22 వేల కోట్ల ప్రజాధనాన్ని గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించారని ఆరోపించారు. పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ అదానీ భాగస్వామ్యంతో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఈ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్ష, పరోక్షంగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా) నివేదికలో నిర్మాణ దశలో 240, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 1,375 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని పేర్కొన్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలోని అంకెల గారడీని ఈ నివేదిక బహిర్గతం చేస్తోందని అన్నారు. డేటా సెంటర్‌కు సుమారు 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని, అంతే స్థాయిలో వేడి వాతావరణంలోకి విడుదలవుతుందని తెలిపారు. డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ను ఏపీ డిస్కంల నుంచి కాకుండా ఏపీ ట్రాన్స్‌కో నుంచి తీసుకునేలా ప్రణాళిక ఉన్నట్లు ఈఐఏ నివేదికలో ఉందని చెప్పారు. గూగుల్ ప్రాజెక్ట్ కారణంగా తమ వ్యవసాయం, ఉపాధిని కోల్పోతున్న తర్లువాడ ప్రాంతానికి చెందిన 520 మంది రైతులకు నష్టపరిహారం, ప్రతి కుటుంబానికి 3 సెంట్ల భూమి శంకుస్థాపన తర్వాత వారం రోజుల్లో ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల తరఫున సీపీఎం పోరాటం చేస్తుందని హెచ్చరించారు.


