పునర్వైభవం దిశగా ప్రాచీన యుద్ధకళ కర్ర సాము
తగరపువలస: కర్రసాము.. భళా అనిపించే విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాచీన యుద్ధకళ. ఒకప్పుడు ఆత్మరక్షణ కోసం ఈ విద్య ఎంతో ప్రాచుర్యం పొందింది. దొంగలు, క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం దీనిని వినియోగించేవారు. అయితే కాలక్రమేణా ఈ కళ అంతరించే దశకు చేరుకుంది. ప్రస్తుతం అమ్మవారి జాతరలు, పెళ్లి ఊరేగింపులు వంటి వేడుకల్లో మాత్రమే ఈ కళ ప్రదర్శితమవుతోంది.
ప్రదర్శన క్లిష్టం
ఈ కళలో అనుభవజ్ఞులు ఒక చేతిలో కర్ర, మరో చేతిలో కత్తితో లేదా ఢాలు, పట్టా కత్తితో ప్రత్యర్థి దాడులను ఎదుర్కొంటూ వేగంగా శరీరాన్ని కదిలిస్తారు. ఈ విన్యాసాల్లో కాస్తా ఏమరపాటు జరిగితే ప్రాణాపాయం తప్పదు. అందువల్ల అత్యంత అప్రమత్తత అవసరం. ప్రస్తుతం కర్రసాము దాదాపు కనుమరుగవుతున్నా, ఇది ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో మేలు చేస్తుందని శిక్షకులు చెబుతున్నారు.
చిప్పాడలో పునర్వైభవానికి కృషి
భీమిలి మండలం చిప్పాడ గ్రామానికి చెందిన కొయ్య రమణారెడ్డి కర్రసాము కళకు పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. గ్రామంలోని సుమారు 40 మంది బాలబాలికలకు ఈ విద్యలో శిక్షణ ఇస్తున్నారు. వారు వివిధ విన్యాసాలతో ప్రతిభ చాటుతున్నారు. రోజూ సుమారు ఏడు గంటల పాటు సాధన చేస్తూ నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. సమీప గ్రామాల్లో వీరు ప్రదర్శనతో సుమారు రూ.30వేల వరకు సంపాదన పొందుతున్నారు.
కఠినమైన వ్యాయామం
కర్ర సాము కఠినమైన వ్యాయామం. శరీర దారుఢ్యానికి ఇది ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రదర్శనలో అప్రమత్తత తప్పనిసరి. – కొయ్య రమణారెడ్డి, శిక్షకుడు
మహిళల భద్రత
నేటి కాలంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు చాలా అవసరం. కర్ర సాము నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలాంటి ఆత్మరక్షణ విద్యలు చిన్న వయసులోనే నేర్చుకుంటే బాగా అలవడతాయి. వయస్సు పెరిగే కొద్దీ నేర్చుకోవడం కష్టమవుతుంది.
– లిఖిత, విద్యార్థిని
ఆత్మరక్షణకు దోహదం
మనకు ప్రత్యేకమైన కళ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కర్రసాము ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుంది. కర్రసాము ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఆత్మరక్షణకు కూడా ఎంతగానో దోహదం చేస్తుంది, – జాహ్నవి, విద్యార్థిని


