కూటమి దెబ్బకు కూలిన ఎండీయూ వ్యవస్థ
311 ఆపరేటర్లకు ఉపాధి సంక్షోభం
నడవని వాహనాలు.. నలిగిన జీవితాలు
అప్పుల బారిన పడిన కుటుంబాలు
రుణాల బారంపై ఆపరేటర్ల ఆవేదన
మహారాణిపేట: పేదల ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేరవేసే లక్ష్యంతో ప్రారంభమైన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వ్యవస్థ ప్రస్తుతం ఉనికిని కోల్పోయింది. ప్రభుత్వం మారిన కొద్ది నెలల్లోనే ఈ పథకం నిలిచిపోవడంతో, దీనిపై ఆధారపడి జీవిస్తున్న 311 మంది ఆపరేటర్ల కుటుంబాలు తీవ్ర ఉపాధి సంక్షోభంలో కూరుకుపోయాయి. ఒకప్పుడు కాలనీలు, గ్రామాలు తిరుగుతూ బియ్యం పంపిణీ చేసిన వాహనాలు ఇప్పుడు నిరుపయోగంగా మూలన పడ్డాయి. వాటిని అమ్ముకోలేక, నడపలేక ఆపరేటర్లు ఆర్థికంగా, మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారు.
ఇంటి వద్ద రేషన్.. ఇక జ్ఞాపకమే!
గతంలో ప్రతి రేషన్ కార్డుదారుడి ఇంటి ముంగిటకే వెళ్లి సరుకులు అందించే విధానం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఎంతో వెసులుబాటుగా ఉండేది. ప్రస్తుతం ఆ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత పద్ధతిలోనే చౌకధరల దుకాణాల (రేషన్ షాపుల) వద్దే పంపిణీని పరిమితం చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల సరుకుల కొలతల్లో మోసాలు జరుగుతున్నాయని, సమయానికి పంపిణీ కావడం లేదని కార్డుదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
పర్యవేక్షణ లోపం..
పక్కదారి పడుతున్న సరుకులు
వ్యవస్థలో పర్యవేక్షణ కొరవడటంతో మధ్యవర్తుల హస్తం పెరిగింది. చెకింగ్ ఇన్‌స్పెక్టర్, సహాయ సరఫరా అధికారులు సరైన తనిఖీలు చేపట్టకపోవడం వల్ల పీడీఎస్ సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 5.12 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు ఉండగా, కేవలం 625 రేషన్ డిపోలు మాత్రమే ఉండటంతో పంపిణీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.
హామీలు ఎక్కడ? ఆపరేటర్ల ఆవేదన
ఎండీయూ వాహనాలను రద్దు చేసిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహన రుణాలు క్లియర్ చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. క్లియరెన్స్ లెటర్లు ఇవ్వకపోవడంతో వాహనాలు సొంతం కావడం లేదు. వాహనాలను ఇతర పనులకు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా బ్యాంకు రుణాలు పెండింగ్‌లోనే ఉండి, పెనాల్టీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీమా గడువు ముగిసింది.. ఆపరేటర్లకు కొత్త కష్టం
ఎండీయూ వాహనాల బీమా గడువు కూడా ముగియడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బీమా రెన్యూవల్ చేయడానికి అవసరమైన డబ్బు లేక వాహనాలను రోడ్డుపైకి తీసుకురాలేకపోతున్నారు.
ఉపాధి పోయింది..
వాహనం భారమైంది
ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వాహన రుణాలపై క్లియరెన్స్ ఇవ్వాలి. రేషన్ పంపిణీ నుంచి తప్పించడంతో ఉపాధి కోల్పోయాం. ప్రస్తుతం బీమా గడువు కూడా ముగియడంతో, ప్రీమియం చెల్లించే స్థోమత లేక వాహనాలను నడపలేకపోతున్నాం. మరోవైపు వాహనాలను అమ్ముకునే అవకాశమూ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– నల్లబోతుల సతీష్,
ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు


