రికార్డుల్లో ఒకరు.. నిర్మాణాల్లో
మరొకరు
సామాన్యుడి భూమికి ‘స్వీట్’గా ఎసరు
సర్వే నంబర్ 1008లో 1011
డాక్యుమెంట్లతో అక్రమ నిర్మాణాలు
హైకోర్టును ఆశ్రయించిన
భూయజమానులు
జాయింట్ సర్వే చేయాలని ఆదేశించిన
పట్టించుకోని అధికారులు
విశాఖ సిటీ : సాగర తీర ప్రాంతంలోని అత్యంత విలువైన పాండురంగాపురంలో భూ మాఫియా కోరలు చాచింది. అధికారుల అండదండలతో సర్వే నంబర్లను తారుమారు చేస్తూ, ఒక వృద్ధుడి వారసత్వ ఆస్తిని కబ్జా చేసేందుకు బడా బాబులు తెగబడుతున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టడం స్థానికంగా సంచలనం రేపుతోంది.
దశాబ్దాల నాటి వారసత్వం.. నేడు వివాదం
బాధితుడు పెంటకోట సీతారామాంజనేయులు కథనం ప్రకారం.. 1959లో ఆయన తాత పెంటకోట శ్రీరాములు నాయుడు, రాణి రుక్మిణి దేవి వద్ద నుంచి సర్వే నంబర్ 1008లో 7.58 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు (డాక్యుమెంట్ నం. 2116/1959). ఈ స్థలంలో ‘మైత్రేయి నగర్’ పేరుతో లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించారు. అయితే అప్పట్లో ప్లాట్లకు, దక్షిణాన ఉన్న గెడ్డకు మధ్య సుమారు 1500 గజాల ఖాళీ స్థలాన్ని మిగులు భూమిగా వదిలివేశారు. తదనంతరం ఈ భూమి తన మనవడైన సీతారామాంజనేయులుకు వీలునామా ద్వారా సంక్రమించింది. 2020లో ఈ భూమి డీ–నోటిఫై అయినప్పటి నుంచి అక్రమార్కుల కన్ను దీనిపై పడింది.
నంబర్ల మార్పిడితో ‘స్వీట్’ కబ్జా
కబ్జాదారులు అత్యంత చాకచక్యంగా సర్వే నంబర్ల మాయాజాలానికి తెరలేపారు. సర్వే నంబర్ 1011కి సంబంధించిన పత్రాలను చూపిస్తూ, సర్వే నంబర్ 1008లోని ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్లాన్ చేశారు. విచిత్రమేమిటంటే, నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ అక్రమంగా నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. ప్రస్తుతం అక్కడ ఐదంస్తుల భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి 1011/1ఏ/1ఏ/3ఏ సర్వే నంబర్‌లో స్థలాన్ని కొనుగోలు చేసిన వారు, సంబంధం లేని 1008 సర్వే నంబర్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు.
కోర్టు ఆదేశాలూ బేఖాతరు
బాధితుడు సీతా రామాంజనేయులు తన వయోభారం దృష్ట్యా తిరగలేక, జీపీఏ హోల్డర్ ద్వారా జీవీఎంసీ, కలెక్టర్ కార్యాలయం, పీజీఆర్‌ఎస్‌కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. 2020లో ఈ భూమి డీ–నోటిఫై అయినట్లు తెలిసినప్పటి నుంచి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదు. దీంతో బాధితుడు అక్రమ నిర్మాణాలు ఆపాలని, జాయింట్ సర్వే నిర్వహించాలని హైకోర్టులో కేసు వేశాడు. దీనిపై హైకోర్టు నాలుగు వారాల్లోగా జాయింట్ సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించాలని గత నెల 18న రెవెన్యూ, జీవీఎంసీ, ఇతర సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సదరు నిర్మాణదారులు సర్వేను ఆపాలని డివిజన్ బెంచ్‌కు వెళ్లినప్పటికీ.. సర్వే చేపట్టాలని కోర్టు వారి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నెల 18వ తేదీతో హైకోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు ముగిసినప్పటికీ.. అధికారులు ఇప్పటి వరకు సర్వే చేపట్టకపోవడం గమనార్హం. అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.


