తెలుగు భాషా రక్షణలో మాట తప్పిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

తెలుగు భాషా రక్షణలో మాట తప్పిన ప్రభుత్వం

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

● తెలుగుతల్లికి దండవేసే దిక్కులేదు ● తెలుగుదండు నిరసన దీక్ష

మద్దిలపాలెం: తెలుగు భాషా రక్షణలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని, అరచేతిలో అమరావతిని చూపిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదండు ఆధ్వర్యంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. మద్దిలపాలెం కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు, మాతృభాషాభిమానులు పాల్గొని తెలుగుతల్లి ‘ఎర్రబుక్కు’లో చిక్కుకుందని నినదించారు. నిరసనలో కవులు, కళాకారులు, మాతృభాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ పాతికేళ్లుగా మాతృభాషా ద్రోహుల చేతుల్లోనే రాష్ట్ర పాలన కొనసాగుతోందని, దీనివల్ల తెలుగుజాతి నిత్యం మోసపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, అలాగే తెలుగు మాధ్యమం కేసును సుప్రీంకోర్టు నుంచి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్యాబోధన తెలుగులోనే జరగాలని, విద్యాహక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై కూడా నిరసనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్సిటీ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులతో నృత్యాలు చేయిస్తున్న పాలకులు, నగరం నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం నివాళులర్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మజ్జి దేవిశ్రీ, డప్పు శ్రీనివాస్‌, డాక్టర్‌ కేవీఎస్‌ మూర్తి, డాక్టర్‌ విజయగోపాల్‌, భాగవతుల సత్యనారాయణ, చేబియ్యం రవిమోహన్‌, నరహరిశెట్టి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement