ఆనందపురం: మండల పరిధిలో సోమవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఆత్మహత్యల ఘటనలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. అనారోగ్య బాధలు భరించలేక ఒకరు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై మరొకరు ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎగువ పాలవలస గ్రామానికి చెందిన కోరాడ శ్రీను(37) గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు తీవ్రమైన శారీరక నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో సోమవారం తెల్లవారుజామున తన నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కోరాడ సంతోషి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ వాసునాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన సారిపిల్లి వినోద్ (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తర్లువాడ వద్ద నిర్మిస్తున్న గూగుల్ డేటా సెంటర్ పనుల కోసం వినోద్ ఇక్కడికి వచ్చారు. అయితే తీవ్రమైన అప్పుల బాధతో సతమతమవుతున్న అతను, మనస్తాపానికి గురై తర్లువాడ సమీపంలోని ఒక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మరణించే ముందు తన తమ్ముడికి ఫోన్ చేసి, తన భార్యాపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరి ఫోన్ కట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన ఆనందపురం పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


