యుద్ధం నేపథ్యంలో ఇన్సూరెన్స్ కవరేజీ రద్దు చేస్తున్న సంస్థలు
కార్గో షిప్స్ భారం మోయలేమంటున్న బీమా కంపెనీలు
100 నుంచి 150 రెట్లు ప్రీమియం చెల్లిస్తే బీమా చేస్తామంటున్న మరికొన్ని సంస్థలు
రూ.12,980 కోట్లతో భారత్ మైరెన్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు చేసిన కేంద్రం
అయినా వెనకడుగు వేస్తున్న నౌకల యజమానులు
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. అంతర్జాతీయ వాణి జ్యానికి ప్రాణాధారమైన సముద్ర మార్గాలను అస్థిరపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ వంటి కీలక జలసంధుల్లో యుద్ధ మేఘా లు కమ్ముకోవడంతో, కార్గో షిప్స్ ప్రయాణం గాలిలో దీపంలా మారింది. ఈ అనిశ్చితి వల్ల నౌకలకు రక్షణ కల్పించాల్సిన అంతర్జాతీయ బీమా సంస్థలు వెనకడుగు వేయడం.. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించే నౌకలకు బీమా రద్దు చేస్తున్నట్లు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రకటించగా.. మరికొన్ని సంస్థలు.. ఏకంగా ప్రస్తుత ప్రీమియం కంటే 100 రెట్ల వరకూ అదనంగా చెల్లిస్తేనే బీమా సౌకర్యం అందిస్తామని చెప్పడంతో సరకు రవాణా భారంగా మారిపోయింది.
సాధారణ సమయాల్లో నౌక విలువలో అతి స్వల్పంగా ఉండే బీమా ప్రీమియం, ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇన్సూరెన్స్ సంస్థలు భారీ గా పెంచేశాయి. ఇప్పటికే ప్రమాదకర ప్రాంతాలుగా ప్రకటించిన జలమార్గాల్లో ప్రయాణించే నౌకలకు బీమా సంస్థలు ఏడు రోజుల ముందస్తు నోటీసుతో పాత ఒప్పందాలను రద్దు చేస్తున్నాయి. నౌకల బీమా పై పడుతున్న ఈ ప్రభావం కేవలం ఓడరేవులకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల ఇంట్లోనూ కుంపటి రగుల్చుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో ముడి చమురు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్ వస్తు వులు, నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వస్తున్నాయి. బీమా సంస్థలు రిస్క్ తీసుకోవడానికి నిరాకరించడం వల్ల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపో యి పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడుతోంది. ఇది పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
వార్ రిస్క్ ప్రీమియం పేరుతో.!
సాధారణంగా ఓడ విలువలో 0.01 నుంచి 0.05 శాతం వరకూ బీమా ప్రీమియం ఉండేది. యుద్ధం కారణంగా.. ఈ ప్రీమియం చెల్లిస్తామని చెబుతున్నా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రద్దు చేస్తున్నాయి. పైగా.. ఇప్పటికే ప్రీమియం చెల్లించినా.. వాటిని రద్దు చేస్తోంది. కొన్ని సంస్థలు మాత్రం.. కార్గో షిప్ ధరలో 3 నుంచి 7.5 శాతం వరకూ అంటే 100 నుంచి 150 రెట్లు అదనంగా ప్రీమియం చెల్లిస్తేనే బీమా ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. అంటే.. 20 వేల కంటైనర్లని తీసుకెళ్లే కార్గో షిప్ ధర రూ.1250 కోట్లు వరకూ ఉంటే.. గతంలో బీమా ఒక ప్రయాణానికి తీసుకుంటే రూ.55 లక్షల వరకూ ఉండేది. ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.75 నుంచి రూ.80 కోట్లు వరకూ చెల్లించాల్సి వస్తోంది. దీంతో.. ఈ భారం మోయలేక.. చాలా కార్గోషిప్ కంపెనీలు. ప్రయాణాల్ని రద్దు చేసుకుంటున్నాయి.
భారత నౌకలపై బీమా ప్రభావం ఎంత.?
భారత్‌లో సుమారు 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని కలిగి ఉండి, అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశంలోని 12 ప్రధాన ఓడరేవుల ద్వారా ప్రతిరోజూ సుమారు 80 నుంచి 100 వరకు భారీ కార్గో నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మన మేజర్ పోర్టులు రికార్డు స్థాయిలో 915 మిలియన్ టన్నుల సరుకును హ్యాండిల్ చేశాయి. మన మొత్తం ఎగుమతి, దిగుమతుల్లో (ఎగ్జిమ్ కార్గో) కేవలం 5 నుంచి 7 శాతం మాత్రమే భారతీయ నౌకల ద్వారా జరుగుతోంది. మిగిలిన 93 శాతం పైగా రవాణా విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నాం. ప్రస్తుతం మన దేశంలో కోస్టల్, ఇంటర్నేషనల్ షిప్స్ కలిపి సుమారు 1,500 కిపైగా వాణిజ్య నౌకలున్నాయి. యుద్ధం కారణంగా విదేశీ కంపెనీలు బీమా దొరకక వెనక్కి తగ్గితే, మన దేశ వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది.
సొంత బీమా నిధి
ఏర్పాటు చేసినా..!
ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం తన సొంత బీమా నిధిని ఏర్పాటు చేయడం వంటి సాహసోపేతమైన అడుగులు వేస్తోంది. విదేశీ బీమా సంస్థలపై ఆధారపడకుండా, స్వదేశీ రక్షణ కవచాన్ని నిర్మించడం ద్వారా వాణిజ్య నౌకలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. రూ.12,980 కోట్లతో ‘భారత్ మైరెన్ ఇన్సూరెన్స్‌పూల్’ ఏర్పాటు చేసి, మన నౌకలకు భరోసా కల్పిస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం సద్దుమణిగితే తప్ప సముద్ర వాణిజ్యం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోలేదు. అప్పటి వరకు ఈ బీమా భారం భారంగానే కొనసాగేలా కనిపిస్తోంది.


