మహారాణిపేట: వందేళ్ల సుదీర్ఘ చరిత్ర, దేశానికే గర్వకారణమైన ఎంతోమంది మేధావులను తీర్చిదిద్దిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానిది. కానీ, ఇప్పుడు జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలు వర్సిటీ వైభవాన్ని చాటేలా కాకుండా, ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏయూలో చదివి, ప్రస్తుతం అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని కనీసం పట్టించుకోకుండా, అధికారులు, ప్రభుత్వ పెద్దలు తమకు ఇష్టమొచ్చిన వారికి మాత్రమే రెడ్ కార్పెట్ వేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ఇలాంటి అవమానకరమైన ఉత్సవాలు దేశంలో ఏ వర్సిటీలోనూ జరిగి ఉండవు’అంటూ మేధావులు, పూర్వ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్–బాధ్యత’అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముందు విద్యార్థులు, మేధావులు అంబేడ్కర్ విగ్రహం నుంచి అల్లూరి భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఏయూ ఉత్సవాల నిర్వహణ తీరును ఎండగట్టారు. అనారోగ్యం కారణంగా ఈ సదస్సుకు రాలేకపోయిన కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈ.ఎ.ఎస్. శర్మ ఒక సందేశాన్ని పంపారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఏయూ సాధించిన అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందన్నారు. యూనివర్సిటీలకు విద్యతో పాటు సామాజిక బాధ్యత అవసరమని, సమాజ ప్రగతికి ఉపకరించే అత్యుత్తమ పరిశోధనలు ఏయూ నుంచి రావాలని ఆకాంక్షించారు. అయితే, శతాబ్ది వేడుకల నిర్వహణ తీరు ఏమాత్రం సక్రమంగా లేదని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మేధావుల సంఘం నాయకుడు మార్కండేయులు, ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.వెంకటరమణ, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు వి.నాగరాజు, పీడీఎస్‌వో జిల్లా అధ్యక్షుడు విశ్వనాధ్ అభిలాష్, పలువురు పూర్వ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


