విద్యార్థుల వేదనలా? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల వేదనలా?

Apr 26 2026 5:09 AM | Updated on Apr 26 2026 5:09 AM

శతాబ్ది వేడుకలా?

ఏయూ శతాబ్ది ఉత్సవాల రిజిస్ట్రేషన్‌ కోసం ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ఎండలో వేచి ఉన్న విద్యార్థులు

విశాఖ సిటీ: వంద ఏళ్ల చరిత్ర.. వేల మంది మేధావుల పురిటిగడ్డ.. దేశ విదేశాల్లో వెలుగులీనిన ఆంధ్ర విశ్వవిద్యాలయ కీర్తి కిరీటం ఇప్పుడు అధికారుల బాధ్యతారాహిత్యంతో వెలవెలబోతోంది. ఈ నెల 27న జరగనున్న శతాబ్ది ఉత్సవాల వేళ, వ్యవస్థీకృత లోపాలు వర్సిటీ ప్రతిష్టను గంగలో కలుపుతున్నాయి. మేధావుల ఇలాకాలో ’రాతియుగపు’ పోకడలు అటు విద్యార్థులను, ఇటు సిబ్బందిని విస్మయానికి గురిచేస్తున్నాయి.

సొంత బిడ్డలకే ‘రిజిస్ట్రేషన్‌’ కష్టాలు!

విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులు, బోధించే ప్రొఫెసర్లు, విధులు నిర్వర్తించే సిబ్బందికి ఇప్పటికే అధికారిక గుర్తింపు కార్డులు ఉన్నాయి. అయితే, ఉత్సవాల్లో పాల్గొనాలంటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు హుకుం జారీ చేయడం విడ్డూరంగా ఉంది. దశాబ్దాల కాలంగా వర్సిటీకి సేవ చేస్తున్న ప్రొఫెసర్లను సైతం సాధారణ రిజిస్ట్రేషన్‌ కోసం క్యూలో నిలబెట్టడం వారిని అవమానించడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సొంత ఇంటి పండగకు వెళ్లడానికి అనుమతి కోసం ఎండలో నిలబడాలా?’ అంటూ మేధావులు మండిపడుతున్నారు.

డిజిటల్‌ యుగంలో.. ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషనా?

దేశం డిజిటల్‌ మార్గంలో దూసుకుపోతుంటే... అదే మార్పుకు దారితీసే విద్యాసంస్థలో మాత్రం పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌ వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పరిస్థితి దారుణంగా మారింది. మండుటెండలో విద్యార్థులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కూడా లేవు. భారీ రద్దీకి సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. ఇది నిర్వహణలో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది.

ప్రముఖుల రాక వేళ.. ఇదేనా ఏర్పాట్ల తీరు?

ఈ వేడుకలకు ఉప రాష్ట్రపతి, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ఇంతటి కీలక సమయంలో క్షేత్రస్థాయి ఏర్పాట్లు ఇంత అధ్వాన్నంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రణాళికా లోపం.. ప్రతిష్టపై మచ్చ

హడావుడి, హంగామా తప్ప క్షేత్రస్థాయిలో ప్రణాళిక కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ప్రతిష్టకు ఇది మచ్చగా మారుతోందని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఈ శతాబ్ది వేడుకలు సంబరంగా కాకుండా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం అనే అభిప్రాయం వినిపిస్తోంది. వందేళ్ల గౌరవాన్ని నిలబెట్టాల్సిన వేడుకలు, నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.

ఏయూ పరువు తీస్తున్న

అధికారుల ’అజ్ఞానం’!

సొంత విద్యార్థులు, ఉద్యోగులకు

రిజిస్ట్రేషన్‌ కష్టాలు

మండుటెండలో విద్యార్థుల ఇబ్బందులు

డిజిటల్‌ యుగంలో..

రాతియుగపు పద్ధతులు

Advertisement
 
Advertisement
Advertisement