విశాఖలో ఇంధన ‘వ్యథ’ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారుల ఆరాటం ఇంధన కొరతపై ఎలాంటి భయం లేదంటున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం/మధురవాడ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ఇప్పుడు ’సిటీ ఆఫ్ డెస్టినీ’ని కలవరపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ లభ్యత తగ్గుముఖం పట్టడం సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది.
ప్రైవేట్ బంకుల్లో ‘నో స్టాక్’ కలకలం
నగరంలోని ప్రైవేట్ పెట్రోల్ బంకుల వద్ద ఒక్కసారిగా ‘నో స్టాక్’ బోర్డులు ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మధురవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ బంకులు మూతపడటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో, ప్రైవేట్ సంస్థలు కొత్త నిల్వలు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఒక్కసారిగా పెరిగిన ఒత్తిడి
ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 300 వరకూ పెట్రోల్ బంకులుండగా.. విశాఖ జిల్లాలో 120 బంకులు ఉన్నాయి. వీటిలో 10 ప్రైవేట్ బంకులు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రైవేట్ బంకుల్లో ఇంధనం నిలిచిపోయిందో, ఆ ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థల బంకులపై పడింది. ప్రైవేట్ బంకులకు వెళ్లాల్సిన వాహనదారులు ప్రభుత్వ బంకుల వైపు మళ్లడం.. పరిమిత నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీ క్యూ లైన్లు.. ముందు జాగ్రత్తగా ట్యాంకులు ఫుల్ చేయించుకోవాలనే తొందరలో వాహనదారుల వల్ల ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది.
డిమాండ్–సరఫరా మధ్య అంతరం
జిల్లాలోని రోజువారీ అవసరాలకు, ప్రస్తుత సరఫరాకు మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. పెట్రోల్ సాధారణంగా రోజుకు 1.5 లక్షల లీటర్ల సరఫరా జరగాల్సి ఉండగా, ప్రస్తుతం అది 90 వేల నుంచి లక్ష లీటర్లకు పడిపోయింది. డీజిల్ రోజువారీ విక్రయాలు లక్ష లీటర్ల వరకు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 80 వేల లీటర్ల సరఫరా మాత్రమే జరుగుతోంది.
వాహనదారుల ఆందోళన
పగటిపూట ఇంధనం అందుబాటులో ఉన్నా, సాయంత్రం, రాత్రి సమయానికి వచ్చేసరికి ‘స్టాక్ అయిపోయింది’ అనే సమాధానం వినిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి వదంతులకు మరింత ఆజ్యం పోస్తోంది.
అసోసియేషన్, అధికారుల భరోసా
జిల్లా పెట్రోల్ బంకుల అసోసియేషన్ ప్రతినిధి నారాయణ మాట్లాడుతూ వాహనదారులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం కేవలం ప్రైవేట్ బంకుల్లో మాత్రమే ఇంధన కొరత కారణంగా ’నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయి. వచ్చే 10 రోజుల్లో సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడిలో పడి, అన్ని బంకుల్లోనూ 100 శాతం స్టాక్ అందుబాటులోకి వస్తుంది,’ అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఈ తాత్కాలిక ఇబ్బందులను గమనించి, వదంతులను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో 25న బంకుల్లో ఉన్న పెట్రోల్,
డీజిల్ స్టాక్ వివరాలు (కిలో లీటర్లు)
కంపెనీ పెట్రోల్ డీజిల్
హెచ్‌పీసీఎల్ 716 684
బీపీసీ 442 665
ఐఓసీఎల్ 424 338
మొత్తం 1582 1687


