ల్యూటినో పారకిట్‌లు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో పండగ వాతావరణం నెలకొంది. జూ వాతావరణం వన్యప్రాణుల పునరుత్పత్తికిఎంతో అనుకూలంగా మారడంతో గత ఏడాదిగా పలు అరుదైన జాతులు తమ సంతతిని విజయవంతంగా వృద్ధి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేవలం నెల రోజుల వ్యవధిలో తొమ్మిది విభిన్న జాతులకు చెందిన ఏకంగా 35 జంతువులు, పక్షుల పిల్లలు జన్మించడం విశేషం. వీటిలో అత్యధికంగా 10 ఆసియాటిక్ వైల్డ్ డాగ్(అడవి కుక్క) పిల్లలు సందడి చేస్తుండగా, ఎనిమిది స్పాటెడ్ డీర్ పిల్లలు కనువిందు చేస్తున్నాయి. వీటితో పాటు ఏడు ఆకర్షణీయమైన ల్యూటినో పారకిట్ పక్షులు, మూడు ఇండియన్ గ్రే వోల్ఫ్(తోడేలు) పిల్లలు జన్మించాయి. అలాగే రెండు గ్రే ఫెలికాన్లు, రెండు రెయింబో లోరికిట్లు, ఒక మార్మోసెట్, ఒక స్ట్రైప్ట్ హైనా, ఒక బార్కింగ్ డీర్ పిల్లలు పుట్టి జూ కుటుంబ పరిమాణాన్ని మరింత పెంచాయి. ఇలా ఒకేసారి ఇన్ని జాతులు తమ సంతతిని వృద్ధి చేసుకోవడాన్ని జూ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ 35 పిల్లలన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో, చురుగ్గా ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. జూ వెటర్నరీ వైద్య బృందం వీటిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకుంటోందని వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే వీటిని ఆయా ఎన్‌క్లోజర్లలోకి విడిచి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇవి త్వరలోనే సందర్శకులను అలరించనున్నాయి.


