న్యాయవాదుల అభ్యున్నతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల అభ్యున్నతే లక్ష్యం

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

విశాఖ లీగల్‌: విశాఖ న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా నమ్మి సన్యాసిరావు యాదవ్‌ ఘన విజయం సాధించారు. శుక్రవారం సాగిన ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప అభ్యర్థిపై 201 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా తన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను న్యాయవాదులు ధీటుగా ఎదుర్కోవాలని, వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని నిరంతరం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు అవసరమైన అన్ని వసతులను బార్‌ కౌన్సిల్‌లో కల్పిస్తామని, ముఖ్యంగా గ్రంథాలయాన్ని ఆధునికీకరించి కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

అంచెలంచెలుగా ఎదిగి అధ్యక్ష స్థానానికి..

నమ్మి సన్యాసిరావు 2003లో నగరంలోని సెయింట్‌ ఆన్స్‌ లా కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. ప్రముఖ న్యాయవాది అందాల శ్రీనివాసరావు వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తన నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో విశాఖ న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నూతన అధ్యక్షుడు సన్యాసిరావుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.కృష్ణమోహన్‌, నర్సింగరావు, బి.వి.ఆర్‌.మూర్తి, మంజులత, కె. రామ జోగేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు.

నూతన కార్యవర్గ ఎన్నిక

ఈ ఎన్నికల్లో అధ్యక్షుడితో పాటు ఇతర కీలక పదవులకు ఎన్నికై న వారు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన కార్యదర్శిగా ఒమ్మి వెంకట సుధాకర్‌ యాదవ్‌, ఉపాధ్యక్షురాలిగా పీలా మీనాక్షి, సంయుక్త కార్యదర్శిగా గాలి రామిరెడ్డి, కోశాధికారిగా సనపల బాలకృష్ణ, మహిళా ప్రతినిధిగా వై.కవిత ఎన్నికయ్యారు.

విశాఖ బార్‌ అసోసియేషన్‌

నూతన అధ్యక్షుడు సన్యాసిరావు

Advertisement
 
Advertisement
Advertisement