ఆరిలోవ/సీతంపేట: ప్రముఖ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత ఎల్.ఆర్.స్వామి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో విశాఖలోని సాహితీ వర్గాల్లో విషాదం నెలకొంది. జన్మతహా మలయాళీ అయినప్పటికీ, ఆయన మాతృభాష తమిళం. ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో స్థిరపడిన ఆయన, తెలుగు భాషపై ఉన్న మక్కువతో అందులో అసాధారణ ప్రావీణ్యం సంపాదించి పలు రచనలు చేశారు. మలయాళంలోని అనేక విశిష్ట రచనలను తెలుగులోకి, తెలుగులోకి ప్రసిద్ధ రచనలను మలయాళంలోకి అనువదించి, రెండు భాషల మధ్య వారధిగా నిలిచారు. ముఖ్యంగా ఆయన అనువదించిన ‘సూఫీ చెప్పిన కథ’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. స్వామి భౌతికకాయాన్ని సందర్శనార్థం విశాలాక్షినగర్ వెటర్నరీ కాలనీలో ఉన్న ఆయన రెండో కుమార్తె నివాసంలో ఉంచారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాహితీవేత్తలు, అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని అక్కడే ఉంచుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.
సాహితీ లోకం సంతాపం
ఎల్.ఆర్.స్వామి మృతి పట్ల సహృదయ సాహితీ, విశాఖ సాహితీ, అరసం, సమతా సాహితీ, సాహిత్య సురభి, అరసం, మేడా బుజ్జమ్మ ట్రస్ట్, తెలుగు దండు, విసా–1971, హిందీ సాహిత్య భారతి, గరిమ, విశ్వనాథ సాహిత్య పీఠం, వంటి సంస్థల ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. శేఖరమంత్రి ప్రభాకర్, ఆచార్య కోలవెన్ను మలయవాసిని, మల్లా ప్రగడ రామారావు, వి.కల్యాణ రామారావు, డాక్టర్ డి.వి.సుబ్బారావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, డాక్టర్ కె.జి.వేణు, ఆచార్య వి.బాలమోహనదాసు, మేడా మస్తాన్‌రెడ్డి, అట్టాడ అప్పలనాయుడు, శిఖామణి, బులుసు వెంకటేశ్వర్లు, తదితర ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బహుభాషా కోవిదుడైన స్వామి మరణం తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా అనువాద రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


