మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న తర్లువాడ పర్యటనను విజయవంతం చేయడానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సీఎం పర్యటనపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గూగుల్ డేటా సెంటర్–ఏఐ హబ్‌కు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. గూగుల్ ప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసి కార్యక్రమం సాఫీగా జరిగేలా చూడాలన్నారు. నిర్ణీత గడువులో హెలిప్యాడ్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు తాత్కాలిక రహదారుల పనులు ముగించాలని ఆదేశించారు. దుమ్ము ఎగరకుండా నీటి పిచికారీ చేయాలని, తాగునీరు, పారిశుధ్యం, ఫైర్, ఎలక్ట్రికల్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున గ్రీన్ రూమ్‌ల ఏర్పాట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
27న వీఈఆర్ సమావేశం
ఈ నెల 27న నోవాటెల్ వేదికగా నిర్వహించనున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) ద్వితీయ సమావేశానికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లను ఆదేశించారు. సంబంధిత ప్రాజెక్టులు, ఇతర అంశాలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని, వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖులతో జరిగే విందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ విజయ్ మణికంఠ, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఆర్డీవోలు పాల్గొన్నారు.


