మే నెలాఖరుకు రహదారులు పూర్తి కావాలి | - | Sakshi
Sakshi News home page

మే నెలాఖరుకు రహదారులు పూర్తి కావాలి

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

విశాఖ సిటీ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీని పెంచే బృహత్తర ప్రణాళిక రహదారుల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో రహదారి పనుల పురోగతిపై ఆయన అంశాల వారీగా సమీక్షించారు. బీటీ కొరత ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి అనుకున్న సమయానికే రహదారులను పూర్తి చేయాలని చెప్పారు. అడవివరం–శొంఠ్యాం, నేరేళ్లవలస–కొత్తవలస రహదారుల్లో అర్హులైన మిగిలిన యజమానులందరికీ జీవీఎంసీ సమన్వయంతో మే 1వ తేదీ నాటికి టీడీఆర్‌ పంపిణీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే మే 15 నాటికి అడవివరం–శొంఠ్యాం రహదారిలో అసంపూర్తిగా ఉన్న కల్వర్టుల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. బోయపాలెం–కాపులుప్పాడ రహదారి చివరి బిటుమినస్‌ కాంక్రీట్‌ లేయర్‌ పనులను మే మొదటి వారంలో, అడవివరం–శొంఠ్యాం రహదారి చివరి బిటుమినస్‌ కాంక్రీట్‌ లేయర్‌ పనులను మే రెండో వారంలో ప్రారంభించాలని సూచించారు. వేపగుంట–పినగాడి రహదారి నిర్మాణంలో భాగంగా మిగిలి ఉన్న కట్టడాలకు పరిహారాన్ని పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రార్థన మందిరాలు, ఆలయ సంబంధ సమస్యలను రెవెన్యూ శాఖ సహాయంతో పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సీఈ వినయ్‌కుమార్‌, సీయూపీ శిల్పా, ఎస్‌ఈ మధుసూదనరావు, ఈఈలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement