అల్లిపురం: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన పలువురు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సత్కరించారు. శుక్రవారం సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో ఆయన 8 మంది సిబ్బందికి పదోన్నతి ఉత్తర్వులను అందజేసి అభినందించారు. ఒకరు సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా, ఒకరు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్‌గా, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. వీరికి సంబంధించిన నూతన ర్యాంకులను, పోస్టింగ్ ఆర్డర్లను సీపీ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


