కన్ను! | - | Sakshi
Sakshi News home page

కన్ను!

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

ఖాళీ స్థలాలపై

జీవీఎంసీ ఖాళీ స్థలాలను ప్రైవేట్‌ వారికి విక్రయించేందుకే ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు స్పష్టం చేస్తున్న టెండర్‌ డాక్యుమెంట్‌

జీవీఎంసీ ఖాళీ స్థలాలు, భవనాల

విక్రయానికి రంగం సిద్ధం

స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ముసుగులో

బినామీలకు దోచిపెట్టే పన్నాగం

ఆదాయార్జన పేరుతో విలువైన

భూములను కారుచౌకగా కాజేసే స్కెచ్‌

అడ్డగోలు నిబంధనలతో డ్రామా..

అంతా బాబు మార్క్‌ మాయాజాలం

‘కంచె కాపాడాల్సినవాడే పంట మేసినట్టు’.. అభివృద్ధి పేరిట విశాఖ ప్రజా ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వం.. జీవీఎంసీకి చెందిన

విలువైన ఖాళీ స్థలాలు, భవనాలను ప్రైవేటుకు అప్పగించే యత్నానికి తెరలేపింది. ‘ఇంటి దొంగను ఈశ్వరుడూ పట్టలేడు’

అన్నట్టుగా.. స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ పేరుతో ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. తక్కువ ధరకే అనుయాయులు,

బినామీలకు కట్టబెట్టే పన్నాగం నడుస్తోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

విశాఖ నగరాభివృద్ధికి పైసా విదిల్చని చంద్రబాబు ప్రభుత్వం.. ఇక్కడి ప్రభుత్వ ఆస్తులను మాత్రం హారతి కర్పూరంలా కరిగించేందుకు సిద్ధమైంది. అడ్డగోలుగా రోడ్లు, పార్కులు, స్టేడియాలను ప్రైవేటుపరం చేస్తూ ఇప్పటికే నగరవాసుల గొంతు కోస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా జీవీఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలు, విలువైన భవనాలపై పడింది. పీపీపీ విధానం, దీర్ఘకాలిక లీజుల పేరుతో నాటకమాడుతూ.. లోపాయకారీగా తన అనుయాయులకు, బినామీలకు కారుచౌకగా విశాఖ భూములను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జీవీఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు, భవనాల ద్వారా ఆదాయాన్ని రాబట్టేందుకు వీలుగా సలహాలు, సూచనలు చేసేందుకు ముందుకు రావాలంటూ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల (ఆర్‌ఎఫ్‌పీ)ను ఆహ్వానించింది. ఈ ప్రక్రియను గ్రేటర్‌ విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ (జీవీఎస్‌సీసీఎల్‌)కు అప్పగించింది. ప్రస్తుతం సాంకేతిక బిడ్లను పరిశీలించే పని కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

నియంత పోకడలు.. ప్రశ్నిస్తే ‘అవుట్‌’

ఈ టెండర్‌ ప్రక్రియలో పొందుపరిచిన నిబంధనలు చూస్తుంటే ఇది పారదర్శకమైన వేలం లాగా కాకుండా, ‘ఎంపిక చేసిన’ వారికే అప్పగించే ప్రక్రియలా కనిపిస్తోంది. ఎటువంటి కారణం చూపకుండానే ఏ బిడ్‌నైనా తిరస్కరించే సర్వాధికారాలు జీవీఎస్‌సీసీఎల్‌కు ఉంటాయి. దీనిపై ఏ సంస్థా కోర్టుకు వెళ్లేందుకు గానీ, ఫిర్యాదు చేసేందుకు గానీ వీల్లేదు. అంటే, ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకున్న సంస్థకు ఈ ఆస్తులు కట్టబెట్టేందుకు వీలుగా ఇతర పోటీదారులను అడ్డగోలుగా తప్పించేందుకే ఈ నిబంధనలు పెట్టినట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

అయోమయంలో

‘స్మార్ట్‌’ వ్యవహారం

ఈ భూ దందాను నేరుగా జీవీఎంసీ ద్వారా కాకుండా.. ‘గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌’ ద్వారా నడిపిస్తుండటం గమనార్హం. దీనికి సరైన యంత్రాంగం లేని ఈ సంస్థ ద్వారా ఒక ప్రైవేటు కన్సల్టెన్సీని మధ్యలోకి తెచ్చారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. జీవీఎంసీ ఆస్తుల పూర్తి వివరాలను, వాటి మార్కెట్‌ విలువను ముందే తమ బినామీలకు చేరవేసి, టెండర్లలో వారికే ప్రయోజనం చేకూరేలా చేయడం. ఆదాయార్జన కోసం సలహాలు అనే పేరుతో.. విశాఖ భూములను ఎవరికి ఏ మేరకు దోచిపెట్టాలనే మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు టెండర్‌లో పేర్కొన్న కొన్ని నిబంధనలు కూడా ఆరోపణలకు మరింత ఊతమిస్తున్నాయి.

గీతంతో మొదలై..

గ్రేటర్‌ను మింగేలా..

వాస్తవానికి నగరంలోని ప్రభుత్వ స్థలాలను తక్కువ ధరకు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ‘గీతం’ సంస్థ నుంచే ప్రారంభించింది. గతంలో గీతం ఆక్రమించుకున్న రూ. 5 వేల కోట్ల విలువైన భూములను అతి తక్కువ ధరకే క్రమబద్ధీకరించేందుకు జీవీఎంసీలో తీర్మానం చేయించడం ద్వారా ప్రభుత్వం తన ఉద్దేశాన్ని చాటుకుంది. చివరకు దత్తపుత్రిక ‘ఆంధ్రజ్యోతి’కి భూమి అప్పగించే విషయంలో కౌన్సిల్‌ అంగీకరించకపోయినా.. రికార్డులను ఫోర్జరీ చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు అదే బాటలో జీవీఎంసీ ఆస్తుల వేలానికి ‘ఆర్‌ఎఫ్‌పీ’ పేరుతో కొత్త నాటకానికి తెరలేపింది.

Advertisement
 
Advertisement
Advertisement