జీవితంలో విలువలూ, సంస్కారమే ప్రధానం | - | Sakshi
Sakshi News home page

జీవితంలో విలువలూ, సంస్కారమే ప్రధానం

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

● సామ్రాజ్య కాంక్షతోనే యుద్ధాలు ● ప్రపంచ శాంతిని కాంక్షించే దేశం భారత్‌ ● మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మద్దిలపాలెం: విద్యతో పాటు జీవితంలో విలువలు, సంస్కారం ఎంతో ప్రధానమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, న్యాయ కళాశాల ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మానవీయ స్పర్శను మరువరాదని హితవు పలికారు. పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు, మహిళలపై దాడులను అరికట్టడంలోనూ, ప్రకృతి పర్యావరణ పరిరక్షణలోనూ న్యాయవాదులు బాసటగా నిలవాలన్నారు. సమాజంతో న్యాయవాదులకు నేరుగా సంబంధం ఉంటుందని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్లు ఎవరు అడ్డుకున్నా ఆగవని, జనాభాలో సగం ఉన్న వారికి తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఏయూ న్యాయ కళాశాల తన గమ్యాన్ని మార్చిందని, ఎదుగుదలకు మొదటి మెట్టు ఇక్కడే పడిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తెన్నేటి విశ్వనాథం వంటి మహనీయులతో గడిపిన క్షణాలు తనలో మార్పుకు కారణమయ్యాయని గుర్తు చేసుకున్నారు. భారతీయులు ఎప్పుడూ సర్వజన హితాన్ని, ప్రపంచ శాంతిని కోరుకుంటారని, ప్రస్తుత యుద్ధాలకు సామ్రాజ్య కాంక్షే కారణమని విశ్లేషించారు. ఆధునిక సాంకేతికతతో పాటు అంతర్జాతీయ న్యాయ పరిణామాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. కళాశాల నుంచి ఉన్నతంగా ఎదిగిన వ్యక్తులు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ వికాసానికి మూలమని, విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్న ప్రజలను ఏకం చేస్తున్నది రాజ్యాంగమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాల శతాబ్ది సంచికను ఆవిష్కరించారు. నల్సార్‌తో పాటు పలు సంస్థలతో అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తొలుత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌, చిత్రకళా ప్రదర్శనను వెంకయ్య నాయుడు ప్రారంభించి తిలకించారు. అనంతరం వర్సిటీ తరపున ఆయన్ని ఘనంగా సత్కరించారు. అతిథులు, విశ్రాంత ప్రిన్సిపాళ్లు, ఆచార్యులను సత్కరించి శతాబ్ది జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.సీతామాణిక్యం, ఐఐయూఎల్‌ఈఆర్‌ (గోవా) వీసీ ఆచార్య ఆర్‌.వెంకటరావు, నల్సార్‌ వీసీ ఆచార్య పి.కృష్ణదేవరావు, డీఎస్‌ఏఎల్‌యూ వీసీ ఆచార్య డి.సూర్యప్రకాశరావు, రెక్టార్‌ ఆచార్య పి.కింగ్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement