నడకపై పన్ను ‘కూటమి’ పిచ్చికి పరాకాష్ట | - | Sakshi
Sakshi News home page

నడకపై పన్ను ‘కూటమి’ పిచ్చికి పరాకాష్ట

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

● సామాన్యుడి నడకపై రూ.720 బాదుడా? ● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ

అల్లిపురం: విశాఖలో వాకింగ్‌ చేసే పౌరులపై పన్ను విధించడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ మండిపడ్డారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనం కోసం వాకింగ్‌ను ప్రోత్సహిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.720 పన్ను విధిస్తూ ప్రజల నడకపై ఉక్కుపాదం మోపుతోందని విమర్శించారు. గత రెండేళ్లలో విశాఖకు ఒక్క అభివృద్ధి పనిచేయని చంద్రబాబు ప్రభుత్వం.. వైఎస్‌ జగన్‌ హయాంలో నిర్మించిన పార్కులు, స్టేడియాలపై పన్నులు వసూలు చేయడం సిగ్గుచేటని అన్నారు. లోకేష్‌ తోడల్లుడు, ఎంపీ భరత్‌కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పగించిన ప్రభుత్వం, సామాన్య పౌరుడు పార్కులోకి వెళ్తే మాత్రం పన్ను విధించడం వారి అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ ‘వాకింగ్‌ టాక్స్‌’ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. సామాన్యుడి శ్వాసపై కూడా పన్ను వేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని, దీనికి ప్రజలే తగిన సమాధానం ఇస్తారని అన్నారు.

అభివృద్ధి శూన్యం..

దోపిడీ అపారం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా విశాఖలో కనీసం ఒక ప్రాజెక్టు గానీ, ఒక్క భవనం గానీ పూర్తి చేయలేదన్నారు. ప్రస్తుతం పన్నులు విధిస్తున్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం, శివాజీ పార్క్‌ వంటి వసతులు వైఎస్‌ జగన్‌ హయాంలో అభివృద్ధి చేసినవేనని తెలిపారు. వాటిపై ఇప్పుడు పన్నులు విధించడం అనుచితమని విమర్శించారు.

విశాఖ నిధుల తరలింపు

విశాఖ వాసులు జీవీఎంసీకి చెల్లించిన పన్ను నిధులను అమరావతికి తరలిస్తున్నారనే సమాచారం ఉందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు వాకింగ్‌ టాక్స్‌ పేరుతో మధ్యతరగతి ప్రజలను వేధిస్తోందని విమర్శించారు. తక్షణమే విశాఖలో వాకింగ్‌ పన్నును రద్దు చేయాలని, లేకపోతే న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సామాన్యుడి నడకపై పన్ను వేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement