కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశం
మహారాణిపేట: రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల జారీకి సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, జిల్లాలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. ప్రస్తుత విధానాన్ని సమీక్షించి, అవసరమైన మార్పులు చేస్తూ లోపాలను సవరించి కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. దీనికోసం ఒక స్పష్టమైన టైమ్ షెడ్యూల్‌ను రూపొందించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈ–కేవైసీ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక తప్పులను ఎప్పటికప్పుడు సవరించి ప్రక్రియను వేగవంతం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ అంశాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు జయలక్ష్మి, సురేశ్ కుమార్, ప్రశాంతి, హరి జవహర్ లాల్ తదితరులు మాట్లాడుతూ.. రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ల ఏర్పాటు, జలధార వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ, రెవెన్యూ, సర్వే, డ్వామా తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.


