మహారాణిపేట: ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు స్థాయి ప్రగతి సాధించినందుకు జీవీఎంసీకు రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు లభించిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్‌షాప్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి.సంపత్ కుమార్ చేతుల మీదుగా అవార్డును, ప్రశంసా పత్రాన్ని స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విశాఖ నగరం ఆస్తి పన్ను చెల్లింపుల్లో అగ్రగామిగా నిలవడానికి పన్ను చెల్లింపుదారులు, ప్రజల సహకారం కీలకమని అన్నారు. 2025–26లో సుమారు రూ.510 కోట్ల వసూళ్లు నమోదై, అదనంగా రూ.60 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ విభాగం, ఫీల్డ్ సిబ్బంది సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించామని, భవిష్యత్తులో కూడా వసూళ్లను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


