రైల్వే ‘నారీ శక్తి’కి అపురూప కానుక | - | Sakshi
Sakshi News home page

రైల్వే ‘నారీ శక్తి’కి అపురూప కానుక

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

● మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు ● ఒకే సారి 20 మంది మహిళలు విశ్రాంతి తీసుకునేందుకు వీలు

విశ్రాంతి తీసుకుంటున్న

రైల్వే మహిళా ఉద్యోగులు

సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వేలో పురుషులతో సమానంగా, ఒక్కోసారి వారిని మించి విధుల్లో నిమగ్నమవుతున్న మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవానికి వాల్తేరు డివిజన్‌ పట్టం కట్టింది. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వారికంటూ ఒక ’సొంత గూడు’ను ఏర్పాటు చేస్తూ డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

సమస్యే పరిష్కారానికి నాంది

ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో, మహిళా సిబ్బంది తమ గోప్యత, విశ్రాంతి కోసం పడుతున్న ఇబ్బందులను డీఆర్‌ఎం స్వయంగా తెలుసుకున్నారు. స్టేషన్లలో నిరంతరం విధుల్లో ఉండే మహిళలకు సరైన విశ్రాంతి గదులు లేకపోవడం వారి ఆరోగ్యంపై, పనితీరుపై ప్రభావం చూపుతోందని గుర్తించిన ఆయన, తక్షణమే అధికారులతో సమావేశమై ‘వుమెన్‌ రెస్ట్‌ రూమ్స్‌‘ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

తొలి విడతలో 5 స్టేషన్లలో..

తొలి విడతలో భాగంగా ఐదు కీలక స్టేషన్లలో విశ్రాంతి గదుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, సింహాచలం, పార్వతీపురం స్టేషన్లలో అత్యాధునిక వసతులతో కూడిన ఈ గదులను బుధవారం ప్రారంభించారు. కేవలం గదులను కేటాయించడమే కాకుండా, విధుల్లో అలసిపోయిన మహిళా ఉద్యోగులకు పూర్తిస్థాయి విశ్రాంతి లభించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గదులలో కూర్చునేందుకు కుర్చీలు, విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు, అత్యవసరమైన మరుగుదొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేశారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నిర్మించిన ఈ కేంద్రాలు మహిళా సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

మా కష్టాన్ని గుర్తించారు

సింహాచలం రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘క్షేత్రస్థాయిలో మా సమస్యలను గుర్తించి, తక్షణమే స్పందించడం మాకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ విశ్రాంతి గదులు మాకు ఒక వరం లాంటివి‘ అని వారు సంతోషంగా చెబుతున్నారు.

అన్ని స్టేషన్లలోనూ ఏర్పాటు చేస్తాం

రైల్వే అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది. వారికి గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం మా బాధ్యత. ప్రస్తుతం ఐదు స్టేషన్లలో ప్రారంభించాం, భవిష్యత్తులో డివిజన్‌లోని మిగిలిన స్టేషన్లకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరిస్తాం.

– లలిత్‌ బోహ్రా, వాల్తేరు డీఆర్‌ఎం

ప్రత్యేక విశ్రాంతి గది

Advertisement
 
Advertisement
Advertisement