హాజరు ఇక్కడ.. వైద్యం అక్కడ! | - | Sakshi
Sakshi News home page

హాజరు ఇక్కడ.. వైద్యం అక్కడ!

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

● తప్పుడు హాజరుతో కళ్లబొల్లి కబుర్లు ● గర్భిణులు, బాలింతల తీవ్ర అవస్థలు

విక్టోరియా ఆస్పత్రి వైద్యుల కాసుల వేట

మహారాణిపేట: ఉత్తరాంధ్రలో ఏకై క ప్రసూతి ఆస్పత్రిగా పేరొందిన ప్రభుత్వ విక్టోరియా(ఘోషా) ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులు కాసుల వేటలో పడ్డారు. ఆస్పత్రిలో డ్యూటీలకు డుమ్మా కొడుతూ, నగరంలోని కార్పొరేట్‌, ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లలో ప్రత్యక్షమవుతున్నారు. విధులకు హాజరైనట్టు ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌)లో తప్పుడు నమోదులు చూపిస్తూ, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతున్నారు. ఆస్పత్రిలో పర్యవేక్షణ లోపం కారణంగా కొందరు వైద్యులు మొక్కుబడిగా సేవలు అందిస్తున్నారంటూ ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. సీనియర్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మసకబారుతున్న ఆస్పత్రి ప్రతిష్ట

పేద మహిళలకు మెరుగైన ప్రసూతి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఘోషాస్పత్రిని ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రసూతి కోసం రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఒకప్పుడు ఇక్కడ వైద్యం బాగా అందుతుందనే నమ్మకం ఉండేది. కానీ, ప్రస్తుత వైద్యుల తీరుతో ఆ పేరు ప్రఖ్యాతులు క్రమేపీ మసకబారుతున్నాయి. ఈ ఆస్పత్రిలో అధికారికంగా 177 పడకలు ఉండాలి. కానీ, డెలివరీల సంఖ్య పెరగడంతో అదనంగా 73 పడకలు వేసి, మొత్తం 250 పడకలతో నడుపుతున్నారు. రద్దీ దృష్ట్యా మరో 20 పడకల నిర్మాణం కూడా చేపట్టారు. ఆస్పత్రిలోని నాలుగు గైనకాలజీ యూనిట్లకు నలుగురు ప్రొఫెసర్లు ఉన్నారు. ఒక్కో ప్రొఫెసర్‌కు ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, వారితో పాటు పీజీ, ఎంబీబీఎస్‌ వైద్య విద్యార్థులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారు. ప్రతి రోజూ ఓపీ విభాగానికి 125 నుంచి 150 మంది వరకు గర్భిణులు, బాలింతలు వివిధ చికిత్సల కోసం వస్తుంటారు.

కాసుల వేటలో ప్రభుత్వ వైద్యులు

ఇంతటి పేరున్న ఆస్పత్రిలో సీనియర్‌ వైద్యులు రోగులకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆన్‌–డ్యూటీ సమయంలోనే వారు ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయం ఆస్పత్రికి వచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు వేసి, వెంటనే కార్పొరేట్‌ లేదా ప్రైవేట్‌ క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం తిరిగి వచ్చి బయోమెట్రిక్‌ వేసి యథావిధిగా ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కు చెక్కేస్తున్నారు. నిత్యం ఎంతో మంది గర్భిణులు ప్రసవం కోసం వస్తుండగా, పీజీలు, ఎంబీబీఎస్‌ విద్యార్థులే వారికి వైద్యం అందిస్తున్నారు. అరకొర వైద్యంతో మొక్కుబడిగా మమ అనిపిస్తున్నారు. అంతేకాకుండా, ‘ఇక్కడ అన్ని సదుపాయాలు లేవు, బయట ఆస్పత్రుల్లో ఆపరేషన్‌ చేయించుకుంటే బాగుంటుంది’అంటూ కొందరు వైద్యులే ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆర్థిక స్థోమత లేక, ప్రైవేటుకు వెళ్లలేక పేద మహిళలు ఆస్పత్రిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

పర్యవేక్షణ కరువు: ఆస్పత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డ్యూటీ సమయంలో వైద్యులు విధుల్లో ఉండకపోవడంతో, ఓపీ నిర్వహణ, డెలివరీలు, బాలింతల చికిత్స అంతా వైద్య విద్యార్థులే చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆకస్మిక ఆరోగ్య సమస్యలు తలెత్తితే గర్భిణులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. పేద ప్రజలు అరకొర వైద్యంతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

నిబంధనలకు విరుద్ధంగా

ప్రైవేట్‌ ప్రాక్టీస్‌

నగరంలో ప్రసూతి వైద్యులకు మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నాన్‌–ప్రాక్టీసింగ్‌ అలవెన్స్‌ తీసుకునే వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయకూడదు. ఒకవేళ ఆ అలవెన్స్‌ తీసుకోకపోయినా, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధిగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే రోగులకు సేవలు అందించాలి. ఆ తర్వాతే ప్రైవేట్‌ క్లినిక్‌లు నిర్వహించుకోవాలి. కానీ, డ్యూటీ వేళల్లోనే ఆస్పత్రిలో ఉండకుండా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో వైద్యుల తీరు, గైర్హాజరు, రోగుల అవస్థలపై ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా ఉన్నతాధికారులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి.

Advertisement
 
Advertisement
Advertisement