మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 1 నుంచి 7వ స్థాయీ సంఘాల సమావేశాలు ఆమె అధ్యక్షతన జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరతపై సభ్యులు భీశెట్టి వరహ సత్యవతి, సోము శివ సత్యనారాయణ, కో–ఆప్షన్ సభ్యుడు పొలమరశెట్టి శివ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తల్లి, శిశువు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసవాల సమయంలో మగబిడ్డ పుడితే రూ.1000, ఆడబిడ్డ పుడితే రూ.500 వసూలు చేస్తున్నారని, మార్చురీ వద్ద మహిళా ఉద్యోగి డబ్బుల కోసం వేధిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. కె.కోటపాడు హైస్కూల్‌లో అనధికారికంగా నిర్మించిన ప్రహరీపై సభ్యురాలు ఈర్లె అనురాధ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఈవో నారాయణమూర్తి.. ఇప్పటికే కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. జిల్లాలోని 349 పాఠశాలల ఆస్తులను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు తాగునీరు, ఓఆర్‌ఎస్, నీడ వంటి వసతులు కల్పించాలని సభ్యులు కోరారు. ఫేషియల్ అటెండెన్స్ యాప్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు సభ దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో రూ.4.56 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ.5.69 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.2.75 కోట్లు ఉపాధి కూలీలకు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఫేషియల్ క్యాప్చర్ ప్రక్రియలో సమయం వృథా కాకుండా చూసేందుకు, కొత్త మొబైల్ పరికరాలను అందజేయడంతో పాటు కూలీల వేతనంలో రూ.25 పెంపుదల చేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ సరుకుల నాణ్యత లోపం, తక్కువ పరిమాణంలో పంపిణీ జరగడంపై పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలకు 10 రోజుల్లోగా సరఫరా పూర్తి చేయాలని, అదనంగా పంచదార, రాగి పిండి అందించాలని సూచించారు. సామాజిక సంక్షేమ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అందాల్సిన సబ్సిడీల విడుదలపై ఉన్న జాప్యాన్ని నివారించాలని, హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలని సభ్యులు కోరారు. ఉపాధి హామీ, నర్సరీల అభివృద్ధిలో జిల్లాలు సాధించిన ప్రగతిని అధికారులు వివరించారు. పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేసేందుకు శాఖల మధ్య సమన్వయం ఉండాలని చైర్‌పర్సన్ జె. సుభద్ర ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ కేంద్రాల్లో రోగులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె. రాజ్ కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


