సమన్వయంతో శతాబ్ది ఉత్సవాలు విజయవంతం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో శతాబ్ది ఉత్సవాలు విజయవంతం

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

మహారాణిపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అందరి సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వీవీఐపీ, వీఐపీల పర్యటనల దృష్ట్యా ప్రోటోకాల్‌ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఉపరాష్ట్రపతి రాకను బట్టి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌, ముఖ్యమంత్రి పర్యటన కోసం కోస్టల్‌ బ్యాటరీ వద్ద హెలిప్యాడ్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ లైజన్‌ అధికారులను నియమించాలి. వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రీన్‌ రూములు, తాగునీరు, అల్పాహారం వంటి వసతులు సమకూర్చాలి. విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటలకే గ్యాలరీల్లో ఆసీనులయ్యేలా చూడాలి. ప్రధాన కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడంతో పాటు, ఏయూ కన్వెన్షన్‌ సెంటర్లో ప్రజల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం జనరేటర్లు, ఫైర్‌ ఇంజన్లు, మెడికల్‌ క్యాంపులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. ఎయిర్‌పోర్టులో రిసెప్షన్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలి.’అని కలెక్టర్‌ ఆదేశించారు. కాఫీ టేబుల్‌ బుక్‌ విడుదల, ఎంవోయూలపై సంతకాలు, ప్రముఖుల సన్మాన కార్యక్రమాలను ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ అధికారులు, జిల్లా యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ విజయ్‌ మణికంఠ, ఇన్‌చార్జి డీఆర్వో టి.గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

Advertisement
 
Advertisement
Advertisement