పన్నుల దరువు | - | Sakshi
Sakshi News home page

పన్నుల దరువు

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

15 శాతం మేర ప్రాపర్టీ ట్యాక్స్‌ పెంపు

వాకర్స్‌ నుంచి ఏడాదికి

రూ.720 వసూలుకు నిర్ణయం

రోడ్లనూ ప్రైవేటు సంస్థలకు అప్పగింత

టోల్‌ వసూలు చేస్తారేమోనని ఆందోళన

● ప్రతి ఇంటికీ వడ్డింపు

● సింహాచలం సమీపంలోని గణేష్‌నగర్‌లోని 2023–24లో ఏడాదికి రూ. 4,890 ఉన్న ఇంటి పన్ను 2026–27 నాటికి ఏకంగా రూ. 7,438కు చేరింది. అంటే ఏకంగా రూ. 2,548 పెరిగిందన్నమాట.

● ఇది కూర్మనపాలెంలోని ఒక ఫ్లాట్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు 2024–25లో సదరు ఫ్లాట్‌ యజమాని ఏడాదికి రెండు విడతలుగా (రూ.1083 చొప్పున) మొత్తం రూ.2,166 చెల్లించేవారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఇది కాస్తా రూ. 2,862కు పెరిగింది. అంటే రెండేళ్లల్లో ఏకంగా 30 శాతం మేర పెరిగింది.

నడవాలన్నా చార్జీ.. ఇంట్లో ఉండాలన్నా పన్ను.. నగర జీవితం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఇప్పటికే వాకర్స్‌పై ఏడాదికి రూ.720 యూజర్‌ చార్జీ విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటి పన్నును వరుసగా రెండేళ్లు ప్రతి సంవ త్సరం 15 శాతం చొప్పున పెంచుతూ నగర ప్రజలకు మరో భారీ షాక్‌ ఇచ్చింది. ఇదే సమయంలో రోడ్లు, పార్కులు, స్టేడియాలను ప్రైవేటుకు అప్పగించే నిర్ణయాలతో.. రాబోయే రోజుల్లో ప్రతి సేవకూ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పేద, ధనిక అనే తేడా లేకుండా చిన్న ఇళ్ల నుంచి భారీ విల్లాల వరకు ప్రతి ఏటా 15 శాతం పన్ను పెంచుకుంటూ పోవడం ప్రభుత్వం అనుసరిస్తున్న ’మార్క్‌’ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

గర ప్రజలపై పన్నుల భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే వాకింగ్‌ చేసే వారికి ఏడాదికి రూ.720 యూజర్‌ ఛార్జీ విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటి పన్నులను కూడా గణనీయంగా పెంచింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే మరో 15 శాతం మేర ప్రాపర్టీ ట్యాక్స్‌ పెంచుతూ నోటీసులు జారీ చేస్తోంది. ఒక వైపు బడా కంపెనీలకు ఎకరాల కొద్దీ భూములను నామమాత్రపు ధరలకే కట్టబెడుతున్న ప్రభుత్వం.. మరోవైపు సాధారణ ప్రజల చిన్న ఇళ్లపైనే అధిక పన్నులు విధించడం విమర్శలకు దారి తీస్తోంది.

ప్రతి ఏడాది 15 శాతం పెంపు

గత రెండేళ్లుగా ప్రభుత్వం వరుసగా ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున ఇంటి పన్నులను పెంచుతోంది. చిన్న ఇళ్ల నుంచి పెద్ద విల్లాల వరకూం పేద, ధనిక తేడా లేకుండా ఈ పెంపు అమలు అవుతోంది. ఇక వాకర్స్‌పై కూడా ఏడాదికి రూ.720 యూజర్‌ ఛార్జీ విధించడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది.

నడిచినా.. ఆడినా డబ్బే..

ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పార్కులు, స్టేడియాలను సైతం ప్రభుత్వం ఆదాయ వనరులుగా మార్చేసింది. వాకర్స్‌ నుంచి ఏడాదికి రూ. 720 వసూలు చేయాలని నిర్ణయించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, సామాన్యుడికి ఆహ్లాదాన్ని కూడా ఖరీదైన వస్తువుగా మార్చేస్తున్నారు.

రోడ్ల ప్రైవేటీకరణ..

టోల్‌ భయం

ఉన్న రోడ్లను నిర్వహణ పేరుతో పీపీపీ పద్ధతిలో పదేళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సదరు సంస్థలకు రుణాలు ఇప్పించడమే కాకుండా, ఆ వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించనుంది. అంతేకాకుండా రోడ్ల పక్కన ప్రకటనల ఆదాయాన్ని కూడా ఆ సంస్థలకే కట్టబెట్టారు. ఈ క్రమంలో భవిష్యత్తులో నగరంలోని రోడ్లపై ప్రయాణించే వాహనదారుల నుంచి ’టోల్‌’ లేదా ’యూజర్‌ చార్జీలు’ వసూలు చేస్తారేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది.

సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం

ప్రభుత్వం పన్నులు పెంచుతున్నా, నగర ప్రజలకు కొత్తగా ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన స్టేడియాలు, పార్కుల వంటి అభివృద్ధి పనులకే ప్రారంభోత్సవాలు చేస్తూ తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఈ రెండేళ్లలో జీవీఎంసీ పరిధిలో ఎక్కడా కొత్తగా రోడ్లను నిర్మించింది లేదు. కేవలం గుంతలను పూడ్చి అదే అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు. జీవీఎంసీ ఖజానాకు కూడా అదనంగా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం ప్రజల నుంచి వసూలు చేసే పన్నులతోనే ఉన్న సౌకర్యాలకు ౖపైపెన మెరుగులు దిద్దుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement