ధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులు
బీచ్‌రోడ్డు: ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు డిమాండ్ చేశా రు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మెమో నంబర్ 7 ప్రకారం 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. జెడ్పీ పరిధిలోని ఉపాధ్యాయుల కారుణ్య నియామక ప్రక్రియ కలెక్టర్ పరిధిలోనే జరగాలని కోరారు. జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ఏర్పాటు చేసి, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఇన్–సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధనను రద్దు చేయాలని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలను గ్రేడ్–1 హెచ్‌ఎంలుగా గుర్తించాలని కోరారు. ఉద్యోగ విరమణ చేసిన రోజే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని, రేషనలైజేషన్ ప్రక్రియను ఏటా కాకుండా ఐదేళ్లకోసారి చేపట్టేలా నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గారావు, గూనూరు శ్రీను, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


