సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

బీచ్‌రోడ్డు: మున్సిపల్‌ కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మార్చికి సంబంధించిన జీతాలను నేటికీ చెల్లించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీలోని అన్ని శాఖల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం క్లాప్‌ డ్రైవర్లు, లోడర్లు, శానిటరీ, యూజీడీ వర్కర్లు విధులను బహిష్కరించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. మార్చి జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, అందుకే ఆందోళన బాట పట్టామని కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పదవీ విరమణ చేసిన, మరణించిన లేదా అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఆప్కోస్‌ ద్వారా ఉపాధి కల్పించాలని విన్నవించారు. గతంలో కమిషనర్‌ సమక్షంలో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్మికులు

Advertisement
 
Advertisement
Advertisement