డాబాగార్డెన్స్: గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములను బదలాయించడం వెనుక బంధుప్రీతి ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆశీల్‌మెట్టలో నిర్వహించిన స్టేట్, సౌత్ యూత్ వింగ్‌ల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడా రు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో గీతం యూ నివర్సిటీ ఆధీనంలో ఉన్న సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం జీవీఎంసీ వేదికగా కుట్రలు పన్నిందని విమర్శించారు. సుమారు రూ.5 వేల కోట్లకు పైగా విలువైన భూములను ధారాదత్తం చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆక్రమణల నుంచి భూములను రక్షించగా, ఇప్పుడు వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల మంది విద్యార్థులతో కలిసి గీతం వర్సిటీ ఎదుట శాంతియుత నిరసన చేపడతామని ప్రకటించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఈ నిరసనలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులతో పాటు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు నిరసనలో పాల్గొనున్నారు.


