డాబాగార్డెన్స్: సైబర్ కేటుగాళ్లు ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలను అస్త్రంగా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాకుండా ఉన్నతాధికారులను సైతం వదలకుండా వారి పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఆర్థిక నేరాలకు తెగబడుతున్నారు. తాజాగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా, పేరు పెట్టుకుని ఇండోనేషియాకు చెందిన నంబర్‌తో కొందరు వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్నారు. కమిషనర్ ఫొటోతో ఉన్న +62 831–7219–6516 అనే ఇండోనేషియా నంబర్ నుంచి పలువురికి మెసేజ్‌లు వెళ్తున్నాయి. ఆ చాటింగ్‌లో తొలుత ‘హలో, ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?’ అని పలకరిస్తూ అవతలి వారిని నమ్మిస్తున్నారు. ఎదుటి వ్యక్తి స్పందించగానే.. ‘చాలా సంతోషం, నాకోసం అత్యవసరంగా ఒక పని చేయాలి’ అంటూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్‌ల పట్ల ప్రజలు, జీవీఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే అభ్యర్థనలను నమ్మవద్దని అధికారులు సూచించారు.


