ఎట్టకేలకు ఏయూ ఉద్యోగులకు జీతాలు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఏయూ ఉద్యోగులకు జీతాలు

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

● మళ్లీ వర్సిటీ అంతర్గత నిధులే దిక్కు ● చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయని గ్రాంట్‌

విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ ఉద్యోగులకు ఎట్టకేలకు జీతాలు జమయ్యాయి. శతాబ్ది ఉత్సవాల వేళ జీతాలు అందక వర్సిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం అధికారుల్లో చలనం తెచ్చింది. వెంటనే జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏయూకు గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో వర్సిటీ అంతర్గత నిధులను వెచ్చించాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏయూ గ్రాంట్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సాధారణంగా ప్రభుత్వ గ్రాంట్‌ ద్వారా వచ్చిన నిధులను జీతాలు, ఇతరత్రా నిర్వహణకు వినియోగిస్తారు. కానీ గత రెండేళ్లుగా సక్రమంగా ప్రభుత్వం గ్రాంట్‌ విడుదల చేయకపోవడంతో వర్సిటీ తన సొంత నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది.

ఇంటర్నల్‌ ఫండ్‌ నుంచి రూ.34 కోట్లు

ప్రతి నెలా ఏయూ పాలకలు ప్రభుత్వ గ్రాంట్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంటున్నారు. కానీ నిధులు మాత్రం రావడం లేదు. ఫలితంగా ఏయూలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ ఉద్యోగులకు జీతాలతో పాటు రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్లు విడుదలలో జాప్యం జరుగుతోంది. శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో కూడా ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ వచ్చిన తర్వాతే జీతాలు వస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు. దీనిపై సాక్షి ‘శతాబ్ది వేళ.. పస్తుల గోల’ పేరుతో ఇచ్చిన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ రానప్పటికీ.. వెంటనే మరోసారి ఇంటర్నల్‌ ఫండ్స్‌ నుంచి రూ.34 కోట్లను సర్దుబాటు చేసి జీతాలు, పెన్షన్లు వారి ఖాతాల్లో జమ చేశారు.

ఏయూపై ఆర్థిక భారం

ఇప్పటికే వర్సిటీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ తరుణంలో ప్రతి నెలా జీతాల కోసం అంతర్గత నిధులను వాడాల్సి రావడం ఏయూకు మరింత భారంగా పరిణమిస్తోంది. వర్సిటీ అభివృద్ధి పనులకు, పరిశోధనలకు కేటాయించాల్సిన నిధులన్నీ జీతాలకే సర్దుబాటు చేస్తుండడం పట్ల విద్యావేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొన్ని నెలల్లో వర్సిటీ ఖజానా పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై వరుస సమీక్షలు చేసిన విశాఖ ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, ఏయూకు రావాల్సిన గ్రాంట్‌పై నోరెత్తకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement