బీచ్‌రోడ్డు : విశాఖ నగరానికి వచ్చే పర్యాటకులకు, స్థానిక యువతకు ఒకప్పుడు హాట్ స్పాట్ అది. రంగురంగుల విద్యుత్ కాంతులు, ఆకట్టుకునే కళాకృతులు, నగరం పేరుతో ఉన్న భారీ అక్షరాలు.. వెరసి సోషల్ మీడియాలో సెల్ఫీలకు కేరాఫ్ అడ్రస్. కానీ, నేడు ఆ ప్రాంతం చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ‘హ్యాష్ ట్యాగ్ వైజాగ్’ ప్రాంతం ఇప్పుడు నిర్వహణ లోపంతో కళావిహీనంగా మారి, పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
కునారిల్లుతున్న ఆకృతులు.. వెక్కిరిస్తున్న రాతలు
సిరిపురం ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ‘హ్యాష్ ట్యాగ్ వైజాగ్’ సందర్శకులతో కళకళలాడేది. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల చూపు ఈ ప్రాంతంపై పడలేదు. నిర్వహణను గాలికి వదిలేయడంతో అక్కడ ఏర్పాటు చేసిన కళాకృతులు విరిగిపోయాయి. ’వైజాగ్’ అనే అక్షరాలు ఊడిపోతుంటే, వాటిని బాగుచేసే నాథుడే కరువయ్యారు. దీనికి తోడు అకతాయిలు ఆ అక్షరాలపై పిచ్చి రాతలు రాసి అందవిహీనంగా మార్చేశారు. కనీసం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలన్న స్పృహ కూడా జీవీఎంసీ అధికారుల్లో లేకపోవడం గమనార్హం.
పర్యాటక స్థలమా? పార్కింగ్ యార్డా?
ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఈ ప్రాంగణం ఇప్పుడు అనధికార పార్కింగ్ జోన్‌గా మారిపోయింది. ఒకప్పుడు పర్యాటకులు నడిచే స్థలంలో ఇప్పుడు బైకులు, కార్లు దర్శనమిస్తున్నాయి. పర్యాటకుల కోసం కేటాయించిన విశాలమైన స్థలాన్ని కుదించి వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల కళ్లెదుటే అన్యాయం : ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అక్రమ పార్కింగ్ అంతా అక్కడే విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసుల కళ్లెదుటే జరుగుతోంది. వాహనదారుల నుంచి చలానాలు వసూలు చేయడంలో చూపే ఉత్సాహం, నగరానికి అందాన్నిచ్చే ఇలాంటి ఐకానిక్ ప్రాంతాలను రక్షించడంలో పోలీసులు చూపకపోవడంపై పర్యాటకులు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్ల ఆవేదన
నాడు ఈ హ్యాష్ ట్యాగ్ వద్ద తీసుకున్న సెల్ఫీలు, చేసిన రీల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయేది. ఇప్పుడు అదే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అధికారులను నిలదీస్తున్నారు. ‘మా జ్ఞాపకాలను ఇలా చిన్నాభిన్నం చేస్తారా?’ అంటూ ఫొటోలను షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ తీరుపై ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకతీతంగా నగరం అందాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా జీవీఎంసీ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు స్పందించి ’హ్యాష్ ట్యాగ్ వైజాగ్’కు పూర్వ వైభవం తీసుకురావాలని నగర ప్రజలు కోరుతున్నారు.
పాడైపోయిన ఆకృతులు, మురికిగా కనిపిస్తున్న హ్యాష్ ట్యాగ్ వైజాగ్, ఊడిపోతున్న హ్యాష్ ట్యాగ్ వైజాగ్ ఆక్షరాలు


