డాబాగార్డెన్స్: ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి యంత్రాంగం స్పందించింది. నగరంలోని ప్రధాన కూడలి అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రైవేట్, సిటీ సర్వీస్ బస్సులు అనధికారికంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కష్టాలపై ‘రాత్రి 7 దాటితే చుక్కలే’ అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ స్పందిస్తూ.. చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఎస్.శ్రీనివాస్ యాదవ్, జి.సత్యనారాయణలను ఆ ప్రాంత పర్యవేక్షణకు ప్రత్యేకంగా నియమించారు. ఈ బృందాలు గురువారం సాయంత్రం కాంప్లెక్స్ పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి. రోడ్డుపైనే అనధికారికంగా పార్కింగ్ చేసిన ప్రైవేట్, సిటీ సర్వీస్ బస్సులను గుర్తించి, వాటిపై కేసులు నమోదు చేయడంతో పాటు అక్కడ నుంచి వాహనాలను తరలించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, ఆపరేటర్లకు కేటాయించిన పార్కింగ్ స్థలాల గురించి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసీ శ్రీనివాసరావు హెచ్చరించారు.


