సాగర తీరంలో ఉత్సాహంగా వాకథాన్
మద్దిలపాలెం: కలిసి సాగుదాం..ప్రగతి దిశగా అనే నినాదంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. బీచ్ రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ వాకథాన్ ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు సాగింది. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న యువత, అదే ఉత్సాహంతో వాకథాన్‌లో సైతం భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. యువత మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతతోనే దేశం సుసంపన్నం అవుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జాలాది రవి, మెగా ఏయూ ఫెస్ట్ చైర్మన్ ఆచార్య ఎన్.విజయ్ మోహన్, కో–చైర్మన్ ఆచార్య ఎ.పల్లవి, కన్వీనర్ డాక్టర్ ఎన్.ఎం.యుగంధర్, పలువురు ఆచార్యులు పాల్గొన్నారు.


