గోపాలపట్నం: స్థానిక కుమారి కల్యాణ మండపంలో శుక్రవారం రాధా రంగ మిత్ర మండలి ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు తొలుత వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంగవీటి రంగ కేవలం ఒక వ్యక్తి కాదని, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలిచి, వారి సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. అటువంటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేయడం, ఆయన అడుగుజాడల్లో నడవటం తమకు దక్కిన అదృష్టంగా అభివర్ణించారు. రంగ నేటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. అనంతరం రాధా రంగ మిత్ర మండలి నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గేదెల మురళీ కృష్ణ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది జిల్లాలో సంస్థ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి దవళ మోహన్‌తో పాటు ఇతర కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కన్వీనర్ కుంచె దత్తాత్రేయ, బెహరా భాస్కరరావు, వివిధ జిల్లాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు.


