ఆక్రమిత భూముల్లో సొంత సామ్రాజ్యం | - | Sakshi
Sakshi News home page

ఆక్రమిత భూముల్లో సొంత సామ్రాజ్యం

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

వాస్తవానికి గీతం యూనివర్శిటీని నిర్మించిన భూములన్నీ ప్రభుత్వానివే. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూముల్లో సొంత సామ్రాజ్యాన్ని గీతం యాజమాన్యం నిర్మించుకుంది. అంతటితో ఆగకుండా ప్రభుత్వానికి చెందిన ఇతర భూముల్లోకి కూడా చొరబడింది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు పూనుకుంది. అంతేకాకుండా ఎండాడ నుంచి రుషికొండకు వెళ్లే ప్రధాన రహదారి కింద అండర్‌ వే బ్రిడ్జి పేరుతో నిర్మాణాలను చేపట్టింది. ఈ అండర్‌ వే బ్రిడ్జి వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎటువంటి అనుమతులూ తీసుకోలేదని తెలుస్తోంది. వాస్తవానికి రోడ్డుకు అటూ ఇటూ ప్రైవేటు సంస్థలకు చెందిన భూములుంటే... వాటిని అనుసంధానించేందుకు అండర్‌ వే బ్రిడ్జిని నిర్మించేందుకు అనుమతి ఉండదు. సాధారణంగా జాతీయ రహదారులతోపాటు రైల్వే లైన్ల కింద అండర్‌ వే బ్రిడ్జిలకు అనుమతిస్తారు. అది కూడా ఆయా ప్రభుత్వరంగ సంస్థలే నిర్మాణాన్ని చేపడుతుంటాయి. ఇందుకు భిన్నంగా ఏకంగా గీతం మెయిన్‌ క్యాంపస్‌కు... మెడికల్‌ కాలేజీని అనుసంధానిస్తూ అండర్‌ వే బ్రిడ్జిని గీతం నిర్మించుకోవడం గమనార్హం. ఒకవేళ అవసరాల రీత్యా ఒక ప్రైవేటు సంస్థ అండర్‌ వే బ్రిడ్జిని నిర్మించుకోవాలంటే... జాతీయ రహదారుల సంస్థతోపాటు స్థానికంగా వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గీతం యాజమాన్యం అటువంటి అనుమతులేవీ లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహారం సాగించినట్టు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement