విశాఖ స్పోర్ట్స్: వాల్తేరు ఈస్ట్‌కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాల్తేరు డివిజన్ అంతర్ విభాగ క్రీడా మేళా శనివారం ఘనంగా ప్రారంభమైంది. వాల్తేరు రైల్వే క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, ఎకో ఆర్‌డబ్ల్యూడబ్ల్యూవో అధ్యక్షురాలు జ్యోత్స్న బోహ్రా కలిసి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ఈ క్రీడా మేళాను ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుల బృందం క్రీడా జ్యోతిని ప్రాంగణమంతా ప్రదర్శిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఇ. సంతారామ్, క్రీడా అధికారి హరినాథ్ మోపురి, సహాయ క్రీడా అధికారి కేతన్ పాటిల్ తో పాటు వివిధ విభాగాల బ్రాంచ్ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రైల్వేలోని వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు.


