మద్దిలపాలెం: ఏయూ శతాబ్ది మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మెగా కల్చరల్ ఫెస్ట్–2026 నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మూ డు రోజుల పాటు ఏయూ క్యాంపస్ విద్యార్థులు, అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ స్థాయిలో సాంస్కృతిక ఉత్సవంగా దీనిని నిర్వహిస్తామని చెప్పారు. కల్చరల్ ఫెస్ట్ చైర్మన్ ఆచార్య ఎన్.విజయ్‌మోహన్ మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 7 గంటలకు ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి రుషికొండ వరకు సైక్లింగ్‌తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సాయంత్రం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదికపై లైవ్ బ్యాండ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 7వ తేదీ సాయంత్రం ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయని వాగ్దేవి సంగీత విభావరి, విదేశీ విద్యార్థుల నృత్యాలు ప్రదర్శిస్తారు. 8వ తేదీ ఉదయం 7 గంటలకు ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి వాక్‌థాన్ నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులను ముఖ్య అతిథి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేస్తారు.


