జైలు గోడల మధ్య లాభాల పంట | - | Sakshi
Sakshi News home page

జైలు గోడల మధ్య లాభాల పంట

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

వీవింగ్‌ యూనిట్‌

బీరువాలు తయారుచేస్తున్న ఖైదీలు

200 మంది ఖైదీలు కార్మికులుగా..

సుమారు 200 మంది ఖైదీలు ఈ పరిశ్రమల్లో నిత్యం శ్రమిస్తున్నారు. వీరికి జైలు అధికారులు నిర్ణీత వేతనాలు చెల్లిస్తారు. వారు శిక్షా కాలం ముగిసి విడుదలయ్యే సమయంలో ఆ మొత్తాన్ని వారికి అందజేస్తారు, తద్వారా వారు బయటి ప్రపంచంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ నగదు ఎంతో తోడ్పడుతుంది. కారాగారంలోని క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో అందరూ కలసిమెలసి పనిచేస్తూ ఆదాయం గడించడమే కాకుండా, వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. జైలు అధికారులు తీసుకుంటున్న ఈ సంస్కరణలు ఖైదీల పరివర్తనకు, జైళ్ల శాఖ ఆర్థిక బలానికి ఎంతగానో దోహదపడుతున్నాయి.

ఖైదీ కార్మికుల ‘నైపుణ్య’జైత్రయాత్రరూ.1.54 కోట్ల ఉత్పత్తులు

రికార్డు స్థాయిలో స్టీల్‌ యూనిట్‌రూ. 95 లక్షల మేర ఉత్పత్తులు

ఆరిలోవ: కేంద్ర కారాగారం కేవలం శిక్షా స్మృతిగానే కాకుండా, ఖైదీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే పారిశ్రామిక కేంద్రంగా మారుతోంది. ఇక్కడ నిర్వహిస్తున్న వివిధ రకాల పరిశ్రమలు ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తూ, కారాగార సంక్షేమ నిధికి భారీగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఇక్కడ కార్మికులుగా మారి, తమ నైపుణ్యంతో నాణ్యమైన వస్తువులను తయారు చేస్తున్నారు. జైళ్ల శాఖ వీరికి చేతినిండా పని కల్పించడమే కాకుండా, వారి ద్వారా వస్తున్న ఆదాయాన్ని తిరిగి వారి సంక్షేమం కోసమే వినియోగిస్తోంది. ఇక్కడి ఉత్పత్తులు బయట మార్కెట్లోని వస్తువులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటం విశేషం.

మొదటి స్థానంలో స్టీల్‌ యూనిట్‌

ఈ కారాగారంలో స్టీల్‌ పరికరాల తయారీ, బేకరీ, చేనేత (వీవింగ్‌), పాడి పరిశ్రమ, వ్యవసాయం వంటి విభిన్న యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమల ద్వారా మొత్తం రూ. 1.54 కోట్ల విలువైన వస్తువులు ఉత్పత్తయ్యాయి. వీటిలో స్టీల్‌ యూనిట్‌ అత్యధికంగా రూ. 95 లక్షల విలువైన ఉత్పత్తులతో ప్రథమ స్థానంలో నిలిచింది. దీని ద్వారా జైలుకు రూ. 13 లక్షల నికర ఆదాయం లభించింది. అలాగే వీవింగ్‌ యూనిట్‌ ద్వారా రూ. 17 లక్షలు, డెయిరీ ద్వారా రూ. 22 లక్షలు, బేకరీ ద్వారా రూ. 14 లక్షలు, వ్యవసాయం ద్వారా రూ. 6.50 లక్షల విలువైన ఉత్పత్తులు వచ్చాయి. అయితే, గత ఏడాదితో (రూ. 1.71 కోట్లు) పోలిస్తే ఈసారి ఉత్పత్తిలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, ప్రధాన పరిశ్రమలు మాత్రం నిలకడగా రాణిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే వస్తువులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో మంచి గిరాకీ ఉంది. స్టీల్‌ యూనిట్‌లో తయారయ్యే బీరువాలు, ఎస్‌–టైపు కుర్చీలు, ఆసుపత్రి పడకలు, పాఠశాల బెంచీలను వివిధ కార్యాలయాలు ముందుగానే బుక్‌ చేసుకుంటున్నాయి. అలాగే బుక్‌ బైండింగ్‌ యూనిట్‌కు కోర్టుల నుండి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో పండించే కూరగాయలు, మామిడి, కొబ్బరి ఉత్పత్తులను జైలు అవసరాలకు పోను మిగిలిన వాటిని ’సుధార్‌ కేంద్రం’ ద్వారా ప్రజలకు విక్రయిస్తున్నారు. పాడి పరిశ్రమలో మేలుజాతి ఆవులు, గేదెల ద్వారా వచ్చే పాలను ఖైదీల అవసరాలకు మరియు బేకరీ యూనిట్‌కు ఉపయోగిస్తున్నారు. బేకరీలో తయారయ్యే రొట్టెలు, బిస్కెట్లు, కేకులు ఖైదీల బంధువులతో పాటు నగరవాసులను కూడా ఆకట్టుకుంటున్నాయి.

నిరంతరం ఉత్పత్తులు జరుగుతాయి

విశాఖ కేంద్ర కారాగారంలోని పరిశ్రమల్లో నిరంతరాయంగా ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఇక్కడ స్టీల్‌ యూనిట్‌తో పాటు పాడి, వ్యవసాయం, బేకరీ పరిశ్రమలు గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా ఖైదీలకు ఉపాధి కల్పించడమే కాకుండా, వారు పొందే వేతనాలు వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. ఖైదీల నైపుణ్యాన్ని పెంపొందిస్తూ, వారిని సామాజిక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే మా ప్రధాన ఉద్దేశం.

–ఎం.మహేష్‌బాబు, పర్యవేక్షణాధికారి, విశాఖ కేంద్ర కారాగారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement