అధికారం అండతో ఎంపీ భరత్‌ అక్రమాల ‘గీతా’లాపన! | - | Sakshi
Sakshi News home page

అధికారం అండతో ఎంపీ భరత్‌ అక్రమాల ‘గీతా’లాపన!

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

సొంత కుటుంబం అధికారం అండతో విశాఖ ఎంపీ భరత్‌ ఆధ్వర్యంలోని గీతం యూనివర్శిటీ అక్రమాలను మరింత జోరుగా సాగిస్తోంది. అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్జాగా క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న గీతం యూనివర్శిటీ.... లోపల ఏకంగా సొంత సామ్రాజ్యాన్నే నిర్మించుకుంటోంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములతోపాటు అదనంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి మరీ ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఈ ఆక్రమిత భూమిని గమనించి గత ప్రభుత్వం వెనక్కి తీసుకుని కంచె వేయడంతోపాటు బోర్డులను కూడా పాతింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ బోర్డులను పీకేయడంతోపాటు ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కోసం చదును చేసే పనులు చేపట్టింది. అంతేకాకుండా ఆక్రమిత ప్రభుత్వ భూములను పార్కింగ్‌ ప్రదేశాలుగా వినియోగించుకుంటోంది. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడు, మంత్రి లోకేశ్‌ తోడల్లుడుతోపాటు విశాఖకు ఎంపీ కూడా కావడంతో భరత్‌కు చెందిన గీతం సంస్థ అక్రమాల వైపు చూసేందుకు అధికారులెవ్వరూ సాహసించడం లేదు.

ఆక్రమిత భూముల్లో అనుమతుల్లేకుండానే నిర్మాణాలు

గీతం ఆక్రమించిన భూములను గత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ... చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలను గీతం చేసింది. ఇందులో భాగంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను గీతం యాజమాన్యానికి తిరిగి కట్టబెట్టేందుకు జీవీఎంసీలో దౌర్జన్యం చేసి, దాడులు చేసి.. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకుని... మీడియాను కౌన్సిల్‌ సమావేశ హాలులోకి రానివ్వకుండా దాడులు చేసి మరీ తీర్మానాన్ని ఆమోదింపచేసుకున్నారు. జీవీఎంసీ కౌన్సిల్‌లో దౌర్జన్యంగా తీర్మానం చేసిన తర్వాత... ఆక్రమిత భూముల్లో నిర్మాణాల కోసం చదును చేసే కార్యక్రమాలను చేపట్టింది. అదేవిధంగా తిరిగి పార్కింగ్‌ కోసం స్థలాన్ని వినియోగించుకుంటోంది. మరో 70 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించుకోవడంతోపాటు అక్కడ జీవీఎంసీ నుంచి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. అనుమతులు ఉన్నాయా? లేవా..? అని జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను అడిగితే అధికారుల నుంచి స్పందన కరువయ్యింది. ఒక వేళ అనుమతి తీసుకుని ఉంటే... నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో జీవీఎంసీ ఇచ్చిన ప్లాన్‌ను బోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుంది. అటువంటిదేమీ అక్కడ కనిపించలేదు. అంటే జీవీఎంసీ నుంచి అనుమతి లేకుండానే వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ హాస్టల్‌ బిల్డింగ్‌ను భారీ స్థాయిలో గీతం యాజమాన్యం నిర్మిస్తోంది. మొత్తంగా తమ కుటుంబ ప్రభుత్వం.... తామేం చేసినా అడ్డుకునే వారు లేరనే రీతిలో గీతం యాజమాన్యం వ్యవహరిస్తోందని విశాఖవాసులు, మేధావులు విమర్శిస్తున్నా వెనక్కు తగ్గడం లేదు.

చంద్రబాబు ప్రభుత్వం రాగానే బోర్డులు పీకేసి..

ప్రభుత్వం కేటాయించిన భూములకు అదనంగా 54.79 ఎకరాల భూమిని గీతం యాజమాన్యం దర్జాగా ఆక్రమించుకుంది. వీటి విలువ రూ.5 వేల కోట్ల మేర ఉంటుంది. ఈ ఆక్రమిత భూముల చుట్టూ గోడ నిర్మించుకోవడంతోపాటు సొంత స్థలం అన్నట్టుగా ఏళ్లకు ఏళ్లు నమ్మబలికింది. ఈ ఆక్రమిత భూములను పార్కింగ్‌తోపాటు ఇతర అవసరాలకు వినియోగించుకుంది. అయితే, గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో ప్రభుత్వానికి చెందిన భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయ డంతో గీతం అక్రమాల వ్యవహారం వెలుగుచూసింది. ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు అధికారులు కంచెను నిర్మించారు. అదేవిధంగా అక్కడ ప్రభుత్వానికి చెందిన భూములంటూ బోర్డులను కూడా పాతారు. అయితే, 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూములను తిరిగి పార్కింగ్‌కు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా బోర్డులను కూడా పీకేశారు. అంటే ఎండాడ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లోనూ గీతం సామ్రాజ్యమే హవా చెలాయిస్తుందన్నమాట.

మేధావులు, విశాఖవాసులు వ్యతిరేకిస్తున్నా ఆగని ఆక్రమణలపర్వం

ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో షెడ్లు నిర్మించి పార్కింగ్‌కు వినియోగం

ప్రభుత్వం వచ్చాక స్వాధీనం చేసుకున్న భూముల్లోనూ నిర్మాణాలు

జీవీఎంసీ నుంచి తీసుకున్న నిర్మాణ అనుమతులపై దోబూచులాట

నిర్మాణ స్థలం వద్ద కనిపించని జీవీఎంసీ అనుమతి బోర్డు

కనీసం స్పందించేందుకు బెదురుతున్న అధికారులు

గతంలో మెడికల్‌ కాలేజీ, మెయిన్‌ క్యాంపస్‌ను అనుసంధానిస్తూ అండర్‌ వే బ్రిడ్జి నిర్మాణం

ఎండాడ – రుషికొండ ప్రధాన రహదారి కింద ఇష్టారాజ్యంగా నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement