సంద్రాన సమరాంగణం సాగర గర్భంలో సొరంగం | Visaka city will once again become the venue for a new revolution in the field of naval defense | Sakshi
Sakshi News home page

సంద్రాన సమరాంగణం సాగర గర్భంలో సొరంగం

Apr 6 2026 4:29 AM | Updated on Apr 6 2026 12:49 PM

Visaka city will once again become the venue for a new revolution in the field of naval defense

‘యుద్ధ సామర్థ్య’ పరీక్షల కోసం విశాఖలో లార్జ్‌ కావిటేషన్‌ టన్నెల్‌(ఎల్‌సీటీ) ఏర్పాటుకు శ్రీకారం

సాక్షి, విశాఖపట్నం: నౌకా దళ రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారనుంది. నౌకా నిర్మాణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. భారత్‌ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ‘లార్జ్‌ కావిటేషన్‌ టన్నెల్‌(ఎల్‌సీటీ)’ నిర్మాణానికి శంకుస్థాపనతో నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ(ఎన్‌ఎస్‌టీఎల్‌) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 

ప్రపంచంలోని అత్యుత్తమ టన్నెళ్లలో ఒకటిగా ఇది నిలవనుంది. సముద్ర గర్భంలోనే యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్ల సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఎల్‌సీటీ పూర్తయితే.. కాన్సెప్ట్‌ డిజైన్‌ నుంచి ఫైనల్‌ టెస్టింగ్‌ వరకూ ఒకే చోట జరిగే వేదికగా విశాఖ చరిత్రపుటలకెక్కనుంది. రెండు రోజుల క్రితం విశాఖలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

ఏమిటీ లార్జ్‌ కావిటేషన్‌ టన్నెల్‌.. 
సాధారణంగా నౌకలు లేదా జలాంతర్గాములు నీటిలో వేగంగా ప్రయాణించేటప్పుడు వాటి ప్రొపెల్లర్ల దగ్గర నీటి ఒత్తిడి తగ్గి, చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే శాస్త్రీయంగా ‘కావిటేషన్‌’ అంటారు. ఈ బుడగలు పేలినప్పుడు విపరీతమైన శబ్దం రావడమే కాకుండా, ప్రొపెల్లర్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల.. పరిశోధనలకు విఘాతం కలుగుతుంటుంది. 

ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసేందుకు, కృత్రిమంగా సముద్ర వాతావరణాన్ని సృష్టించే ఒక భారీ నీటి సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే ‘లార్జ్‌ కావిటేషన్‌ టన్నెల్‌’ అని పిలుస్తారు. విశాఖలో సుమారు 230 మీటర్ల పొడవు ఉండే టన్నెల్‌ని నిర్మించనున్నారు. ఈ టన్నెల్‌లో నీటి ప్రవాహ వేగాన్ని, ఒత్తిడిని నియంత్రిస్తూ నౌకల నమూనాలను పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. 

ఎల్‌సీటీ ప్రయోజనాలేంటి.? 
» యుద్ధ సమయంలో శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండాలంటే నౌకలు శబ్దం చేయకూడదు. ఈ టన్నెల్‌ ద్వారా ప్రొపెల్లర్ల శబ్దాన్ని కనిష్ట స్థాయికి ఎలా తగ్గించాలో శాస్త్రవేత్తలు పరిశోధించవచ్చు.
 
» భారీ నౌకలను సముద్రంలోకి దించిన తర్వాత లోపాలు గుర్తిస్తే సరిదిద్దడం కష్టం. కానీ ఎల్‌సీటీలో నమూనా నౌకలను ఉంచి, వివిధ వేగాల వద్ద అవి ఎలా పనిచేస్తాయో ముందే తెలుసుకోవచ్చు. ఫలితంగా.. లోపాల్ని సులువుగా సరిదిద్దే అవకాశం ఉంటుంది. 

»  ప్రొపెల్లర్ల రూపకల్పనను మెరుగుపరచడం ద్వారా నీటి ఘర్షణను తగ్గించి, ఇంధన వినియోగాన్ని ఆదా చేయవచ్చు. 

» కేవలం నౌకలే కాదు.. నీటిలోపల ప్రయోగించే క్షిపణులైన టార్పెడోల్ని కూడా ఇక్కడ పరీక్షిస్తారు. టార్పెడో నీటిలో ప్రయాణించేటప్పుడు దాని స్థిరత్వం ఎలా ఉంది, ప్రయాణ మార్గంలో నీటి ఒత్తిడికి అది ఎలా స్పందిస్తోంది అనేది ఇక్కడ కచ్చితంగా లెక్కించవచ్చు. 

అభివృద్ధి చెందిన దేశాల సరసన 
ఈ ఎల్‌సీటీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతికొద్ది అత్యాధునిక టన్నెళ్లలో ఒకటి. దీని నిర్మాణంతో అమెరికా, రష్యా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారత్‌ నిలవనుంది. ఇది కేవలం మన దేశ అవసరాలకే కాకుండా, భవిష్యత్తులో మిత్ర దేశాల నౌకా నమూనాల పరీక్షలకూ వేదికవుతుంది.  

నౌకాదళానికి, ఎన్‌ఎస్‌టీఎల్‌కు లాభమేంటంటే.? 
నగరంలో ఉన్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌టీఎల్‌ ఆధ్వర్యంలో ఈ ఎల్‌సీటీ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. గతంలో ఈ తరహా పరీక్షల కోసం రష్యా లేదా యూరప్‌ దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశంలోనే, స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. 

దీనివల్ల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అదేవిధంగా.. మన యుద్ధ నౌకల డిజైన్లు, రహస్యాలు ఇతర దేశాలకు తెలియకుండా మన దగ్గరే భద్రంగా ఉంటాయి. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా అత్యాధునిక సబ్‌మెరైన్లు, టార్పెడోలు, యుద్ధ నౌకల తయారీలో ఎన్‌ఎస్‌టీఎల్‌ శాస్త్రవేత్తలకు ఇది ఒక శక్తివంతమైన ఆయుధంగా మారనుంది. 

దీని నిర్మాణం పూర్తయితే.. విశాఖ, ఎన్‌ఎస్‌టీల్‌లో నౌకా నిర్మాణానికి సంబంధించి ‘కాన్సెప్ట్‌ డిజైన్‌ నుంచి ఫైనల్‌ టెస్టింగ్‌ వరకూ అన్నీ ఒకే చోట జరగనున్నాయి. ఇది మన రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో శాస్త్రవేత్తల మేధస్సుకు, భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ఒక నిలువెత్తు నిదర్శనమని రక్షణ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement