పేద విద్యార్థుల సంక్షేమమే ధ్యేయం
మహారాణిపేట: పేద విద్యార్థుల విద్య, ఆరోగ్యం, సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఆదివారం సీతమ్మధార సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటగది, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి మెనూ వివరాలు, వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మంత్రి అల్పాహారం స్వీకరించారు. హాస్టల్‌లో పరిశుభ్రత, సౌకర్యాల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థికి ఆపన్నహస్తం
విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో.. పుట్టుకతోనే కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి ఇబ్బంది పడుతున్న మారిపల్లి చందు అనే విద్యార్థిని మంత్రి గమనించారు. వెంటనే స్పందించిన మంత్రి.. ప్లాస్టిక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ సుబ్బారెడ్డితో వీడియో కాల్‌లో మాట్లాడి విద్యార్థి పరిస్థితిని వివరించారు. చందుకు ఉచితంగా వైద్యం చేయించేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.


