మార్పు మన ఓటుతోనే మొదలవ్వాలి
మహారాణిపేట: ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధమని, ప్రతి పౌరుడు దీనిని బాధ్యతగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన దేశంలో అత్యున్నత రాజ్యాంగం ఉండటం వల్లే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగుతోందని, ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదని, సామాజిక బాధ్యతని గుర్తు చేస్తూ, యువత తమ ఓటు విలువను గుర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల మైండ్‌సెట్ మారాలని, కులమతాలకు అతీతంగా ఓటు వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ ఏడాది విశాఖ జిల్లాకు ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. అనంతరం సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ ఓటర్లను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జేసీ విద్యాధరి, జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి సత్తిబాబు, ఆర్డీవో సుధాసాగర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.
మార్పు మన ఓటుతోనే మొదలవ్వాలి


