గీతం భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
సింహాచలం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భీమిలి ప్రాంతంలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా బాబులకు కారుచౌకగా కట్టబెడుతున్నారని విజయనగరం జెడ్పీ చైర్మన్, భీమిలి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. ఆదివారం సాయంత్రం సింహాచలంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రూ.2,500 కోట్ల విలువైన భూములపై కన్ను విశాఖ ఎంపీ భరత్‌కు చెందిన గీతం విద్యాసంస్థల ఆధీనంలో ఉన్న సుమారు 60 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం చూడటం దుర్మార్గమని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. సుమారు 2,500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఎకరం కేవలం 99 పైసలకే ధారాదత్తం చేస్తూ, దానివల్ల ఉపాధి కలుగుతుందని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. అసలు ఇంత పెద్ద మొత్తంలో భూమి వారి స్వాధీనంలోకి ఎలా వచ్చింది? విద్యాసంస్థల పేరుతో ఉచిత సేవ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న వారు.. ఏ ఒక్క పేద విద్యార్థికై నా అక్కడ ఉచితంగా చదువు చెప్పిస్తున్నారా? అని ఆయన నిలదీశారు. నగర సుందరీకరణ పేరుతో రాత్రికి రాత్రే వీధి వ్యాపారుల బంకులను కూల్చివేస్తూ పేదవాడి పొట్ట కొడుతున్న ప్రభుత్వం, బడా సంస్థల ఆక్రమణలను మాత్రం క్రమబద్ధీకరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ‘గతంలో నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరించుకున్న భూములు కూడా ఇప్పుడు ప్రభుత్వానివే. ఎంపీ భరత్ ఇప్పటి వరకు తన నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికై నా ఒక సెంటు భూమి పట్టా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి, నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని సంకల్పించారని, కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న భూ అక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చూపిస్తామని, సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై కూడా తమ గళాన్ని వినిపిస్తామని ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.


