పైసా విదిల్చలే..! | - | Sakshi
Sakshi News home page

పైసా విదిల్చలే..!

Nov 4 2025 6:50 AM | Updated on Nov 4 2025 6:50 AM

పైసా విదిల్చలే..!

పైసా విదిల్చలే..!

జిల్లాలోని ఆయా ప్రభుత్వ విభాగాల ఖజానాలపై కూటమి ప్రభుత్వం కన్ను సమ్మిట్‌లో ఎవరి పనులకు వారే నిధులు వెచ్చించాలంటూ మౌఖిక ఆదేశాలు సివిల్‌ సప్లయ్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ నిధులు సమ్మిట్‌ పాలు

పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు నిధుల వేట ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో తలలు పట్టుకుంటున్న అధికారులు

సాక్షి, విశాఖపట్నం : ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యడం.. భారీ కార్యక్రమాన్ని నిర్వహించి.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని బాకాలు ఊదడం.. తర్వాత చూస్తే.. ఏ ఒక్క ప్రాజెక్టూ క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం.. తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రతిసారీ జరిగే తంతే ఇది. పావలా కోడికి.. రూపాయి మసాలా అన్నట్లుగా.. భారీ ఏర్పాట్లతో ప్రచారార్భాటం కోసం.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ నిధులన్నింటినీ ఊడ్చే కార్యక్రమాలు మళ్లీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. మొన్న జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసమే అన్ని ప్రభుత్వ విభాగాలూ.. తమ ఖజానానికి ఖాళీ చేసెయ్యగా.. ఇప్పుడు మరోసారి నిధులు మీరు పెట్టండి.. మేం చూసుకుంటామంటూ ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

17 నెలల్లోనే రూ.100 కోట్లకు పైగా ఖర్చు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్‌ కో తమ ప్రచారం కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో జిల్లా ఖజానా రోజురోజుకీ ఖాళీ అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లోనే జిల్లాకు చెందిన రూ.100 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తమ ప్రచార యావ కోసం ఖర్చు పెట్టించింది. దీంతో జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరోసారి పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో ప్రచార బాకాలు ఊదరగొట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పనులు ప్రారంభించాలంటూ అధికారులకు ఆదేశాలివ్వడం.. ప్రతి రెండు మూడు రోజులకోసారి సమీక్షలు నిర్వహించి.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడమే తప్ప.. దీనికి ఎంత ఖర్చు అవుతుంది..? నిధులు ఉన్నాయా లేవా.? నిధులు మంజూరు చేయాలా అనే విషయాలపై మాత్రం కూటమి సర్కార్‌ కనీసం మాట్లాడటం లేదు. దీంతో ఇదెక్కడి ప్రచార బాధరా భగవంతుడా అంటూ ఉన్నతాధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.

రూ.100 కోట్ల వరకు

బకాయిలు

ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉండగా.. ఆ ఊసే తేవడం లేదు. గతంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం వద్ద బకాయిలుండగా.. ఈ సమ్మిట్‌ విశాఖ జిల్లాకు గుదిబండగా మారుతోందని.. అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించడం.. తర్వాత నిధులిచ్చేందుకు నిరాకరించడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది.

తలో చెయ్యి వేయాల్సిందే..!

ఇటీవల మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంతో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. నిధుల విషయం జిల్లా ఉన్నతాధికారులు ప్రస్తావించగా.. నిధుల గురించి ప్రస్తావన తీసుకురావద్దన్నట్లుగా తెలుస్తోంది. ఉన్న నిధుల్ని ఖర్చు చేసి ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగంలో నిధులతో పాటు ఇతర విభాగాల్లో ఉన్న నిధులను కూడా వాడుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీవీఎంసీ రూ.40 కోట్ల వరకూ ఖర్చు చేస్తుండగా.. వీఎంఆర్‌డీఏ, కమర్షియల్‌ ట్యాక్స్‌, టూరిజం, పౌరసరఫరాలు, పరిశ్రమల శాఖలతో పాటు.. ఇతర విభాగాల నుంచి కూడా నిధులు ఈ ఏర్పాట్ల కోసం అనధికారికంగా ఖర్చు చేయాలంటూ హుకుం జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే.. పర్యాటక శాఖ తమ ఖజానాలో రూ.లక్ష కూడా లేవని చెప్పడంతో సంబంధిత మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ముఖ్యమైన పరిశ్రమలు, సంస్థల నుంచి నిధులు సమీకరించాలంటూ పరిశ్రమలు, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు సలహాలిచ్చారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement