10 నుంచి పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
విశాఖ స్పోర్ట్స్: విశాఖ వేదికగా జరగనున్న 40వ అఖిల భారత అంతర సర్కిళ్ల పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ లోగో, టీజర్‌ను విశాఖ ప్రాంతీయ పోస్ట్‌మాస్టర్ జనరల్ వి.ఎస్.జయశంకర్ విడుదల చేశారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ఎంవీపీ కాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఎరీనాలో ఈ పోటీలు జరగనున్నాయి. దేశంలోని 14 పోస్టల్ సర్కిళ్లకు చెందిన 121 మంది మెన్, వుమెన్‌తో పాటు వెటరన్స్ పోటీల్లో పాల్గొనున్నారు. మెన్, వుమెన్‌కు సింగిల్స్‌తో పాటు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ పోటీలు నిర్వహించనుండగా వెటరన్స్ కోసం ప్రత్యేక కేటగిరిలో పోటీలు జరగనున్నాయి. గతేడాది గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్‌లో జరిగిన పోటీల్లో పశ్చిమ బెంగాల్ జట్లు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాయి. సోమవారం విశాఖలోని పోస్టల్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ ఎన్.వి.ఎస్.ఎస్.రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ కోమల్‌కుమార్, ఆసిస్టెంట్ డైరెక్టర్ కెవిడి సాగర్ తదితరులు పాల్గొన్నారు.


