దారికి రాని ‘రెవెన్యూ’
మహారాణిపేట: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వస్తున్నా, వాటి పరిష్కారం ఆలస్యం అవుతుండటంపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు తగ్గకపోవడం, ఆర్జీదారులు మళ్లీ మళ్లీ వస్తుండటంతో, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు తహసీల్దార్లకు ఫోన్ చేసి ప్రశ్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 413 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 148 ఉండడం గమనార్హం. జీవీఎంసీకి 126, పోలీసు శాఖకు 32, ఇతర విభాగాలకు 107 వినతులు వచ్చాయి. సమస్యల పరిష్కారంలో భాగంగా, ఫిర్యాదుదారులతో సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులే నేరుగా మాట్లాడాలని, దిగువ స్థాయి సిబ్బంది మాట్లాడటానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తూతూమంత్రంగా కాకుండా, ప్రతీ ఫిర్యాదుదారుతో అధికారులు తప్పకుండా మాట్లాడాల్సిందేనని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
పనుల్లో నాణ్యతపై విచారణ జరపాలి
జీవీఎంసీ పరిధిలోని 53వ వార్డులో జరుగుతున్న రోడ్లు, కాలువలు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనుల్లో తీవ్రమైన నాణ్యత లోపం ఉంది. దీనికి కొంత మంది అధికారుల నిర్లక్ష్యమే కారణం. ఈ విషయంపై ఆగస్టు 4, 11 తేదీల్లో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశా..ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. దీనివల్ల పీజీఆర్‌ఎస్‌పై ప్రజలకు నమ్మకం పోతోంది. నాణ్యత లోపంపై కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ జరిపించాలి.
–షేక్ బాబ్జీ, ఉత్తర నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు
నా ఇల్లు కబ్జా చేయాలని చూస్తున్నారు
మధురవాడ శివశక్తి నగర్‌లో 30 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న నా ఇంటిని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇంటిని కూల్చివేసి, ఇసుక వేసి బయటకు రానివ్వకుండా చేస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నందున భయంతో బతుకుతున్నాను. ఈ విషయంలో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. వైఎస్సార్‌సిపి ఇంటెలెక్చువల్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కెండేయులు చొరవతో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి, న్యాయం చేయాలి.
–షేక్ మదీనా బీబీ, శివశక్తి నగర్, మధురవాడ
							దారికి రాని ‘రెవెన్యూ’
							దారికి రాని ‘రెవెన్యూ’

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
